భగవద్గీత !!

ద్వితీయోధ్యాయః!

అర్థతాత్పర్యాలతో

 

 



||ఓమ్ తత్ సత్||
సంజయ ఉవాచ:
తం తథా కృపయా విష్టం అశ్రుపూర్ణాకులేక్షణమ్ |
విషీదంత మిదం వాక్యం ఉవాచ మథుసూదనః ||1||

"ఆవిధముగా కనికరముచే కూడినవాడును, కన్నీరుతో నిండిన వ్యాకులమైన కళ్ళు కలవాడును, దుఃఖించుచున్నవాడును అగు అర్జునినితో మధుసూదనుడు ఈ వాక్యములు చెప్పెను"

శ్రీమద్భగవద్గీత
సాంఖ్య యోగము
ద్వితీయోధ్యాయః
శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమః

భగవద్గీత సాంఖ్యయోగము ఆత్మ తత్వం

ప్రథమోధ్యాయములో అర్జునుడు విషాదములో మునిగి పోయి" నాకు ఈ రాజ్యము వద్దు, ఈ విజయము వద్దు" అంటాడు. ఇంకా తను కౌరవులందరిని చంపి రాజ్యము అనుభవించే బదులు " నిరాయుధుడైన తనని ఆయుధులైన కౌరవులు చంపినా" అది క్షేమకరము అని కూడా అంటాడు. అలా అని శస్త్రములను పడవేసి రథములో చతికిలబడతాడు అర్జునుడు. రెండవ సర్గ సంజయుని మాటలతో మొదలవుతుంది . ముందు సంజయుడు అర్జునుని మానసిక స్థితిని వర్ణిస్తాడు.తరువాత కృష్ణార్జున సంవాదము మొదలవుతుంది .

ఇక రెండవ అధ్యాయము

||శ్లోకము 1||

తం తథా కృపయాఽఽవిష్టం అశ్రుపూర్ణాకులేక్షణమ్ |
విషీదన్త మిదం వాక్యం ఉవాచ మధుసూదనః ||1||

స|| తథా కృపయా అవిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతం తం ( అర్జునం) మధుసూదనః ఇదం వాక్యం ఉవాచ ||

||శ్లోకార్థములు||

తథా కృపయా అవిష్టం - అట్లు కనికరము చేత కూడికొనియున్నవాడును
అశ్రుపూర్ణాకులేక్షణం - కన్నీటితో నిండికొనియున్నవ్యాకులమైన నేత్రములు కలవాడును
విషీదంతం తం- దుఃఖించుచున్నవాడును అగు వానితో
మధుసూదనః ఇదం వాక్యం ఉవాచ- మధుసూదనుడు ఈ వాక్యములను పలికెను

||శ్లోకతాత్పర్యము||

సంజయుడు చెప్పెను-
"అట్లు కనికరము చేత కూడికొనియున్నవాడును, కన్నీటితో నిండికొనియున్నవ్యాకులమైన నేత్రములు కలవాడును, దుఃఖించుచున్నవాడును అగు అర్జునినితో, కృష్ణుడు ఈ వాక్యములను పలికెను". ||1||

సంజయుడు అర్జుని గురించి చెపుతూ
" శోకసంవిగ్న మానసం" - అంటే దుఃఖముతో చలించిన మనస్సు కలవాడు అని
"అశ్రుపూర్ణాకులేక్షణమ్" - కన్నీటితో నిండిన నేత్రములు కలవాడు అని
" విషీదంతం" - దుఃఖములో వున్నవాడు అని అంటాడు.
ఇవన్నీ అర్జునిని మానసిక స్థితిని వర్ణిస్తాయి
ఆ శోకములో వున్నఅర్జునుడితో మధుసూదనుడు అంటే కృష్ణుడు తన భాషణము మొదలుపెడుతాడు..
మధుసూదనుడు అంటే మధు అనే రాక్షసుని చంపినవాడు అని. ఇక్కడ కూడా కృష్ణుడు అర్జునిని ఆవరించిన అజ్ఞానమును నశింప చేయాలి. అది సూచిస్తూ కృష్ణుడికి మధుసూదనుడు అని పదము ప్రయోగించబడినది

.||శ్లోకము 2||

శ్రీ భగవానువాచ:
కుతస్త్వా కశ్మలమిదం విషమే సముపస్థితమ్ |
అనార్య జుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున ||2||

స|| హే అర్జున ! అనార్య జుష్టం అస్వర్గ్యం అకీర్తికరం ఇదం కశ్మలం విషమే త్వాం కుతః సముపస్థితం ? ||2||

||శ్లోకార్థములు||

అనార్య జుష్టం - ఆర్యులుకానివారిచే అవలంబింపబడతగిన
అస్వర్గ్యం అకీర్తికరం - స్వర్గప్రాప్తికి భంగకరమైన. అపకీర్తి కలిగించునది అగు
ఇదం కశ్మలం - ఈ మనో వ్యాకులత్వము
విషమే త్వాం - ఈ విషమ సమయములో నిన్ను
కుతః సముపస్థితం - ఎక్కడనుంచి చుట్టుకుంది

||శ్లోకతాత్పర్యము||

"ఓ అర్జునా ? ఈ విషమ సమయములో ఆర్యులుకాని వారిచే అవలంబింపబడతగిన,
స్వర్గప్రాప్తికి భంగకరమైన. అపకీర్తి కలిగించునది అగు ఈ మనో వ్యాకులత్వము
నిన్ను ఎక్కడనుంచి చుట్టుకుంది"||2||

ఇక్కడ ఆర్యులుకాని వారు అని అనడములో కృష్ణుడు అర్జునుని, నీ మాటలు మానసికముగా ఉన్నత స్థితిలో వున్నవారు ఎవరు చెప్పరు అని చెపుతున్నాడు. ఆ కాలములో ఆర్యులు అంటే పెద్దమనుష్యులు, పెద్దరికము వున్నవారు.

||శ్లోకము 3||

క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్త్వయ్యుపపద్యతే |
క్షుద్రం హృదయ దౌర్బల్యం త్వక్యోత్తిష్ట పరన్తప ||3||

స|| హే పార్థ ! క్లైబ్యం మాస్మ గమః ఏతత్ త్వయి న ఉపపద్యతే | హే పరన్తప ! క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వా ఉత్తిష్ఠ ||

||శ్లోకార్థములు||

క్లైబ్యం మాస్మ గమః - అధైర్యమును పొందకుము
ఏతత్ త్వయి న ఉపపద్యతే - ఇది నీకు తగదు
హే పరన్తప - శత్రువులను తపింపచేయువాడా
క్షుద్రం హృదయ దౌర్బల్యం - నీచమైన మనోదుర్బలత్వమును
త్యక్త్వా ఉత్తిష్ఠ - వదిలేసి లెమ్ము

||శ్లోకతాత్పర్యము||

"ఓ పార్థా, అధైర్యమును పొందకుము. ఇది నీకు తగదు.
ఓ శత్రువులను తపింపచేయువాడా, నీచమైన మనోదుర్బలత్వమును వదిలేసి లెమ్ము".||2||

ఇక్కడ కృష్ణుడు ముందు ధైర్యము చెప్పుచున్నాడు. పరన్తపా అంటే శత్రువులను తపింపచేయువాడా అనడములో కృష్ణుడు అర్జునిడికి శివుడితో యుద్ధము చేయగలిగిన పరాక్రమమును గుర్తు చేస్తున్నాడు.

అంతేకాదు. "ఉత్తిష్ఠ" , లెమ్ము ! లేచి యుద్ధము చెయ్యి అని అంటాడు. ఈ "ఉత్తిష్ఠ" అనే మాట ఇంకా వింటాము. ఇది హెచ్చరిస్తూ ఉపనిషత్తులలో చెప్పేమాట. కృష్ణుడు ఈ మాట తన ఉపదేశములో పలుసార్లు అర్జునిడికి చెపుతాడు.

ఉపనిషత్తులలో "ఉట్టిష్ఠత! జాగ్రత! ప్రాప్యవరాన్నిబోధత" , అని చెప్పబడుతుంది. అంటే "లెమ్ము మేలుకొనుము, మహనీయులను సమీపించి విజ్ఞానము పొందుము" అని. అదే మాట కృష్ణుడు ఇక్కడ చెప్పుతున్నాడు.

||శ్లోకము 4||

అర్జున ఉవాచ:
కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూధన |
ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన ||4||

స|| హే మధుసూదన ! పూజార్హౌ భీష్మం ద్రోణం చ సంఖ్యే( యుద్ధే) అహం ఇషుభిః కథం ప్రతియోత్స్యామి ||

||శ్లోకార్థములు||

అరిసూదన మధుసూధన - ఓ శత్రువులను నశింపచేయగల మధుసూదన
పూజార్హౌ భీష్మం ద్రోణం చ - పూజించ తగిన భీష్మ ద్రోణులను
సంఖ్యే అహం ఇషుభిః - యుద్ధములో నేను బాణములతో
కథం ప్రతియోత్స్యామి - ఎట్లు ఎదురుకొనగలను

||శ్లోకతాత్పర్యము||

" శత్రువులను నశింపచేయగల ఓ మధుసూదనా, పూజించ తగిన భీష్మ ద్రోణులను యుద్ధములో నేను బాణములతో
ఎట్లు ఎదురుకొనగలను".||4||

అంత శోకములో వున్న అర్జునిడికి "పరంతప" అన్నమాట తో సరిపోలేదు.
అర్జునుడు శోకము గురించి ఇంకా చెపుతాడు.
భీష్మద్రోణులు పూజింపతగినవారు. అట్టి వారితో యుద్ధము ఎలాచెయ్యగలను అని. అంతేకాదు ఇంకా చెపుతాడు.

||శ్లోకము 5||

గురూ నహత్వాపి మహానుభావాన్
శ్రేయోభోక్తుం భైక్షమపీహలోకే |
హత్వా అర్థకామాంస్తు గురూనిహైవ
భుఞ్జీయ భోగాన్ రుథిర ప్రదిగ్థాన్ ||5||

స||మహానుభావాన్ గురూన్ అహత్వా ఇహలోకే భైక్ష్యం అపి భోక్తుం శ్రేయః హి | గురూన్ హత్వాతు ఇహైవ రుధిర ప్రదగ్ధాన్ అర్థకామాన్ భోగాన్ భుఞ్జీయ |

||శ్లోకార్థములు||

మహానుభావాన్ గురూన్ అహత్వా - మహానుభావులగు గురువులను చంపక
ఇహలోకే భైక్ష్యం అపి - ఈ లోకమందు బిక్షాన్నమైనను
భోక్తుం శ్రేయః హి - భుజించుట మంచిది కదా
గురూన్ హత్వాతు - గురువులను చంపినచో
ఇహైవ రుధిర ప్రదగ్ధాన్ - ఈ లోకములోనే రక్తముచే పూయబడిన
అర్థకామాన్ భోగాన్ భుఞ్జీయ - అర్థకామరూపములగు భోగములను భుజించినవాడనగుదును.

||శ్లోకతాత్పర్యము||

"మహానుభావులగు గురువులను చంపక, ఈ లోకమందు బిక్షాన్నమైనను భుజించుట మంచిది కదా.
గురువులను చంపినచో ఈ లోకములోనే, రక్తముచే పూయబడిన అర్థకామరూపములగు భోగములను భుజించినవాడనగుదును"".||5||

||శ్లోకము 6||

న చైతద్విద్మః కతరన్నో గరీయో
యద్వా జయేమ యది వానో జయేయుః|
యానేవ హత్వా న జిజీవిషామః
తేఽవస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః||6||

స|| నః కతరత్ గరీయః ఏతత్ చ న విద్మః | జయేమ యది వా నః జయేయుః యది వా (న విద్మః) |
యాన్ హత్వా న జిజీవిషామః తే ధార్త రాష్ట్రా ఏవ ప్రముఖే ( సమ్ముఖే) అవస్థితాః ||6||

||శ్లోకార్థములు||

నః కతరత్ గరీయః - మనకు ఏది శ్రేష్ఠమో
ఏతత్ చ న విద్మః - అది కూడా తెలియదు
జయేమ యది వా - జయించెదమో
నః జయేయుః యది వా - లేక మనలను జయించెదరో( తెలియదు)
యాన్ హత్వా న జిజీవిషామః - ఎవరిని చంపి జీవించ కోరమో
తే ధార్త రాష్ట్రా ఏవ ప్రముఖే ( సమ్ముఖే) అవస్థితాః - ఆ ధార్తరాష్ట్రులు ఎదుట నిలిచి వున్నారు.

||శ్లోకతాత్పర్యములు||

"ఈ యుద్ధములో మనము జయించెదమో లేక వారు మనలను జయించెదరో తెలియదు.
మనకు ఏది శ్రేష్ఠమో కూడా అది కూడా తెలియదు. ఎవరిని చంపి జీవించ కోరమో
ఆ ధార్తరాష్ట్రులు ఎదుట నిలిచి వున్నారు."||6||

'ఎవరిని చంపి జీవించ కోరమ", అనడములో అర్జునుడు ఎదురుగా నిలిచి వున్నభీష్మద్రోణాదుల గురించి చెపుతున్నాడు.

||శ్లోకము 7||

కార్పణ్యదోషోఽపహతస్వభావః
పృచ్చామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః |
యత్ శ్రేయస్స్యాన్నిశ్చితం బ్రూహితన్మే
శిష్యస్తేఽహం శాధి మాం త్వాం ప్రపన్నమ్||7||

స|| కార్పణ్యదోషోపహత స్వభావః (అహం) ధర్మ సమ్మూఢ చేతాః త్వాం ప్రపచ్ఛామి | యత్ నిశ్చితం శ్రేయః స్యాత్ తత్ బ్రూహి | అహం తే శిష్యః | త్వాం ప్రపన్నం( శరణాగతం) మాం శాధి |

||శ్లోకార్థములు||

కార్పణ్యదోషోపహతస్వభావః- కృపణత్వము అనబడే దోషముతో
ధర్మ సమ్మూఢ చేతాః - ధర్మవిషయమున సందిగ్ధమనస్సు కలవాడై
త్వాం ప్రపచ్ఛామి - నిన్ను అడుగుచున్నాను.
యత్ నిశ్చితం - ఏది నిశ్చయముగా
శ్రేయః స్యాత్ తత్ బ్రూహి - మంచిదో అది చెప్పుము.
అహం తే శిష్యః - నేను నీ శిష్యుడను
త్వాం ప్రపన్నం మాం శాధి - నిన్నుశరణుపొందిన నన్ను శాసించుము

||శ్లోకతాత్పర్యములు||

"కృపణత్వము అనబడే దోషముతో ధర్మవిషయమున సందిగ్ధమనస్సు కలవాడై నిన్ను అడుగుచున్నాను. ఏది నిశ్చయముగా మంచిదో అది చెప్పుము. నేను నీ శిష్యుడను. నిన్నుశరణుపొందిన నన్ను శాసించుము".||7||

ఈ సందిగ్ధమనస్సు. ఏది మంచిదో తెలియకపోవడము ఒక "కృపణుడి" గుణము. అదే కృపణత్వము, అంటే ఒక పిసినిగొట్టుతనము. ఏదీ వదలలేని వాడి కథ. ఇంత వ్యథ లోనూ అర్జునిడికి తన వ్యథకి కారణము తెలుసును.

||శ్లోకము 8||

న హి ప్రపశ్యామి మమాపనుద్యాత్
యచ్చోక ముచ్ఛోషణ మిన్ద్రియాణామ్|
అవాప్య భూమా వసపత్న మృద్ధం
రాజ్యం సురాణామపి చాధిపత్యమ్ ||8||

స|| భూమౌ అసపత్నం ఋద్ధం రాజ్యం అవాప్య( వా) సురాణాం అధిపత్యం చ (అవాప్య) అపి ఇన్ద్రియాణామ్ ఉచ్ఛోషణమ్ మమ శోకం యత్ అపనుద్యాత్ తత్ న ప్రపశ్యామి (పశ్యామి) హి ||

||శ్లోకార్థములు||

భూమౌ అసపత్నం - ఈ భూమండలములో శత్రువులులేనట్టి
ఋద్ధం రాజ్యం అవాప్య- సమృద్ధమైన రాజ్యమును పొంది,
సురాణాం అధిపత్యం చ - దేవతలయొక్క అధిపత్యము సాధించి కూడా
ఇన్ద్రియాణామ్ ఉచ్ఛోషణమ్ - ఇంద్రియములను తపింపచేయు
మమ శోకం యత్ అపనుద్యాత్ - నా శోకమును ఏది పోగొట్టునో
తత్ న ప్రపశ్యామి (పశ్యామి) హి - అది నేను కనుగొనలేకున్నాను

||శ్లోకతాత్పర్యములు||

"ఈ భూమండలములో శత్రువులులేనట్టి సమృద్ధమైన రాజ్యమును పొంది, లేక దేవతలయొక్క అధిపత్యము సాధించి కూడా,
ఇంద్రియములను తపింపచేయు నా శోకమును, ఏది పోగొట్టునో అది నేను కనుగొనలేకున్నాను"||8||

||శ్లోకము 9||

సంజయ ఉవాచ:
ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతపః|
న యోత్స్యే ఇతి గోవిన్దం ఉక్త్వా తూష్ణీం బభూవ హ ||9||

స|| పరంతపః గుడాకేశః హృషీకేశం ఏవం ఉక్త్వా నయోత్స్యే ఇతి గోవిన్దం ఉక్త్వా తూష్ణీం బభూవ హ ||

||శ్లోకార్థములు||

పరంతపః గుడాకేశః - శత్రువులను తపింపచేయు అర్జునుడు
హృషీకేశం ఏవం ఉక్త్వా - కృష్ణుడి తో ఈ విధముగా చెప్పి,
నయోత్స్యే ఇతి గోవిన్దం ఉక్త్వా - యుద్ధముచెయ్యను అని కృష్ణునకు చెప్పి
తూష్ణీం బభూవ హ - ఊరకవుండెను.

||శ్లోకతాత్పర్యములు||

సంజయుడు చెప్పుచున్నాడు
"శత్రువులను తపింపచేయు అర్జునుడు కృష్ణుడి తో ఈ విధముగా చెప్పి,
యుద్ధముచెయ్యను అని కృష్ణునికి చెప్పిఊరకవుండెను"||9||

"దృష్ట్వాతు పాండవానీకమ్.." (1.2) అన్న మాటనుంచి, "నయోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభువ హ" (2.09) అని,
అర్జునుడు రథము మీద మాటలాడకుండా చతికిలబడడము వఱకు మనము విన్నది శోకము మోహము.

ఈ శోకమోహాలు పుట్టడానికి కారణము మమత్వమే. అర్జునుడు "వీరు నావారు", "నేను వీళ్ళవాడను" అన్నభావన వలన భ్రాంతిలో పడ్డాడు. దీనిలోంచి బయట పడడానికి, అంటే ఈ శోకమోహాలను అధిగమించడానికి ఆత్మ జ్ఞానమే ముఖ్యము.

అర్జునిని ఉదాహరణగా ఉంచుకొని, భవంతుడు లోకసంగ్రహార్థము ఆత్మ గురించి తన దివ్యమైన ఉపదేశమును మొదలెడతాడు పదకొండవ శ్లోకము నుంచి.

||శ్లోకము 10||

తం ఉవాచ హృషీకేశః ప్రహసన్నివ భారత |
సేనయోరుభయోర్మధ్యే విషీదన్తం ఇదం వచః||10||

స|| భారత ! ఉభయోః సేనయోః మధ్యే విషీదన్తం తం ( అర్జునమ్) హృషీకేశః ప్రహసన్నివ ఇదం వచః ఉవాచ ||

||శ్లోకార్థములు||

భారత - ఓ మహరాజా
ఉభయోః సేనయోః మధ్యే విషీదన్తం- రెండు సైన్యముల మధ్యలో దుఃఖించుచున్న
తం ( అర్జునమ్) హృషీకేశః - ఆ అర్జునుడితో కృష్ణుడు
ప్రహసన్నివ ఇదం వచః ఉవాచ - నవ్వుచున్నవాని వలె ఇట్లు పలికెను

||శ్లోకతాత్పర్యములు||

"ఓ మహరాజా, రెండు సైన్యముల మధ్యలో దుఃఖించుచున్న ఆ అర్జునుడితో కృష్ణుడు
నవ్వుచున్నవాని వలె ఇట్లు పలికెను".||10||

ఇది, ఓ మహరాజ అంటూ ధృత తరాష్ట్రునితో సంజయుడు చెప్పుచున్నమాటలు.
ప్రహసన్నివ అంటే దయతో నవ్వుచున్నవాని వలె అని. కృష్ణుడు అర్జునుని మానసిక స్ఠితి చూసి జాలితో నవ్వుటు చెప్పిన మాటలు ఇవి.

||శ్లోకము 11||

శ్రీ భగవానువాచ

అశోచ్యా నన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే |
గతాసూ నగతాసూంశ్చ నాను శోచన్తి పణ్డితాః ||11||

స|| త్వం అశోచ్యాన్ అన్వశోచః | ప్రజ్ఞావాదాంశ్చ భాషసే | పణ్డితాః గతసూన్ అగతసూన్ చ న అనుశోచన్తి||

||శ్లోకార్థములు||

త్వం అశోచ్యాన్ అన్వశోచః - నువ్వు శోకించతగని వాటిపై శోకించుచున్నావు
ప్రజ్ఞావాదాంశ్చ భాషసే - పండితునివలె మాటలు చెప్పుచున్నావు
పణ్డితాః గతసూన్ - పండితులు మరణించినవారి గురించింది
అగతసూన్- బ్రతికియున్నవారిగురించి
న అనుశోచన్తి- దుఃఖించరు

||శ్లోక తాత్పర్యము||

"నువ్వు శోకించతగని వాటిపై శోకించుచున్నావు. పండితునివలె మాటలు చెప్పుచున్నావు.
పండితులు మరణించినవారి గురించి, బ్రతికియున్నవారిగురించి దుఃఖించరు."||11||

ఇక్కడ కృష్ణుడు అర్జునుడితో, "నువ్వు శోకింప దగని విషయము గూర్చి శోకించు చున్నావు. పెద్ద పెద్ద మాటలు కూడా చెపుతున్నావు .
జ్ఞానులు మరణించిన వారి గురించి గాని జీవించి యున్న వారిని గురించి గాని దుఃఖింపరు" అని అంటాడు. ఎందుకు దుఃఖించ అవసరము లేదో ముందు శ్లోకములలో చెపుతాడు కృష్ణుడు.

భగవద్గీతలో "దృష్ట్వా తు పాండవానీకమ్."(1.2 ) అన్న మాట దగ్గరనుంచి
"న యోత్స్య ఇతి గోవిందమ్ ఉక్త్వా తూష్ణీం బభూవ హ "(2.10) అనే శ్లోకముదాకా మనము వినేది చూచేది అర్జునిడి మమత్వము ద్వారా కలిగిన శోకము.

అర్జునుడు తీవ్రమైన సందిగ్ధావస్థలో వున్నాడు. ఏది ధర్మము? ఏది కాదు. తన గురువులు బంధువులు మిత్రులు అనుకుంటూ మమత్వములో పడి తన ధర్మము ఏమిటి అనే ఆ సందిగ్ధము. ఆ సందిగ్ధమో దుఖము. అలాగ దుఃఖములో వున్నవానికి సమాధానము కావాలి. ఆ సమాధానము అలోచించడానికి కావలసిన జ్ఞానము వుండాలి. జ్ఞానము వచ్చిన తక్షణమే సమాధానము కూడా వస్తుంది

ఇలాగ ధర్మము గురించి సందిగ్ధావస్థలో వున్న అర్జునుడికి, కృష్ణుడు ఈ సమయములో శోకము ఎందుకు కూడదు అంటూ చెప్పడానికి తన జ్ఞాన బోధ మొదలెడతాడు. ఆ సమాధానముకు కావలసినది ఆత్మ జ్ఞానము. ఆత్మ జ్ఞానము దేహి, అంటే దేహములో వున్న ఆత్మ, గురించి. దేహము అనిత్యమైనా గాని దేహములో వుండే దేహి (అంటే ఆత్మ) అనిత్యముకాదు అని. ఈ ఆత్మ జ్ఞానము చెపితే చదివితే చూస్తే వచ్చేది. ఆ జ్ఞానము సంపాదించడానికి మార్గము కూడా చెప్పాలి. సంపాదించే మార్గము చెప్పడానికి, కర్మబంధములను అధిగమించే కర్మ సిద్ధాంతము కూడా చెప్పవలసివస్తుంది.

కృష్ణుడు ఇది ఈ అధ్యాయములో క్రమక్రమముగా మెట్టు తరువాత మెట్టులా ఇవన్నీవిశదీకరిస్తూ చెపుతాడు.

దీనిలో కృష్ణుడికి ఒకటే ధ్యాస. జ్ఞానము, జ్ఞానము సంపాదించే మార్గములు చెప్పి, వాటిద్వారా అర్జునుడు తన ధర్మమును తనే చేపట్టాలి అని.
అదే తన ధ్యేయముగా తలచుకొని కృష్ణభగవానుడు తన గీత సందేశము మొదలెడతాడు.

||శ్లోకము 12||

నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః |
న చైవ న భవిష్యామః సర్వే వయమతః పరమ్ || 12||

స|| అహం జాతు నాసం (ఇతి) న తు ఏవ | త్వం న అసీః ఇతి న | ఇమే జనాధిపః ( న ఆసన్ ఇతి) న | అతః పరం వయం సర్వే న భవిష్యామః (ఇతి) చ న ఏవ ||12||

||శ్లోకార్థములు||

అహం జాతు నాసం (ఇతి) న తు ఏవ - నేను ఒకప్పుడు లేను అనునది లేనే లేదు
త్వం న అసీః ఇతి న - నీవు లేవు అనునది లేదు.
ఇమే జనాధిపః ( న ఆసన్ ఇతి) న - ఈ రాజులు లేరు అనునది లేదు.
అతః పరం - ఇక ముందు
వయం సర్వే న భవిష్యామః - మనము ఉండము అనునది
(ఇతి) చ న ఏవ - లేదు

||శ్లోక తాత్పర్యము||

"నేను ఒకప్పుడు లేను అనునది లేనే లేదు. నీవు లేవు అనునది లేదు.
ఈ రాజులు లేరు అనునది లేదు. ఇక ముందు మనము ఉండము అనునది కూడా లేదు"||12||

అంటే మనము ఎప్పుడూ వున్నవాళ్ళమే. మనదేహాలు మారాయి కాని మనము మనమే. మనము నిత్యము. ఈ రాజులు కూడా అంతే అని. అది ఎలాగ అన్నది ముందు శ్లోకములో చెపుతాడు.

||శ్లోకము 13||

దేహినో అస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా |
తథా దేహాన్తరప్రాప్తిః ధీరః తత్ర నముహ్యతి ||13||

స|| దేహినః అస్మిన్ దేహే కౌమారం యౌవనం జరా యథా ( భవతి) తథా దేహాన్తర ప్రాప్తిః ( భవతి) | తత్ర ధీరః న ముహ్యతి ||13||

||శ్లోకార్థములు||

దేహినః అస్మిన్ దేహే - జీవునకు ఈ దేహములో
కౌమారం యౌవనం జరా - బాల్యము యౌవనము వృద్ధాప్యము
యథా ( భవతి) తథా - ఎలాగ కలుగునో అట్లే
తథా దేహాన్తర ప్రాప్తిః - మరియొక దేహము పొందుట ( జరుగును)
తత్ర ధీరః న ముహ్యతి - ఈ విషయములో ధీరులు శోకించరు.

||శ్లోక తాత్పర్యము||

"జీవునకు ఈ దేహములో బాల్యము యౌవనము వృద్ధాప్యము ఎలాగ కలుగునో అట్లే
మరియొక దేహము పొందుట జరుగును. ఈ విషయములో ధీరులు శోకించరు"||13||

ఇక్కడ "దేహీ", అంటే దేహములో ఉన్నది అని. అది జీవుడు. అదే ఆత్మ. ఆత్మ బాల్యావస్థ నుంచి యవ్వన వార్థక్యములు దాటి
మరణానంతరము తరువాత మరొక దేహము పొందుతుంది. అంటే ఆత్మ కి మరణ జననములు లేవు అన్నమాట. అంటే "దేహీ", అదే దేహములో వున్నఆత్మ నిత్యము అని.

ఈ విధముగా ఆత్మ గురించి మొదలుపెట్టి కృష్ణుడు అర్జునునికి అత్మ యొక్క తత్త్వము గురించి చెపుతాడు.

||శ్లోకము 14||

మాత్రా స్పర్శాస్తు కౌన్తేయ శీతోష్ణ సుఖదుఃఖదాః |
అగమాపాయినోఽనిత్యాః తాం స్తితిక్షస్వ భారత ||14||

స|| హే కౌన్తేయ ! మాత్రా స్పర్శాస్తు శీతోష్ణ సుఖ దుఃఖదాః అగమాపాయినః | అనిత్యాః |హే భారత ! తాన్ తితిక్షస్వ ||14||

||శ్లోకార్థములు||

మాత్రా స్పర్శాస్తు - ఇంద్రియముల యొక్క విషయములపై సంయోగము
శీతోష్ణ సుఖ దుఃఖదాః - శీతము ఉష్ణము దుఃఖము సుఖము కలుగచేయునవి.
అగమాపాయినః- అవి వచ్చి పోవునవి
అనిత్యాః- అస్థిరమైనవి.
హే భారత ! తాన్ తితిక్షస్వ - ఓ అర్జునా వాటిని భరించుము.

||శ్లోక తాత్పర్యము||

"ఇంద్రియముల యొక్క విషయములపై సంయోగము, శీతము, ఉష్ణము, దుఃఖము, సుఖము కలుగచేయునవి. అవి వచ్చి పోవునవి. అస్థిరమైనవి. ఓ అర్జునా వాటిని భరించుము".||14||

ఆత్మ నిత్యమే అనుకుందాము. అయితే ఆత్మ పోయింది అనే శోకము లేకపోయినా ఈ చలి వేడి సుఖ దుఃఖాలవలన దేహమునకు శోకము ఉండవచ్చుకదా అనిపించవచ్చు. దానికి కృష్ణుడు వాటిని అంటే ఆ శీతోష్ణ సుఖదుఃఖాలను "తితిక్షస్వ" భరించు అంటాడు ( 2.14). 'తితిక్షస్వ' అంటే భరించు పరవాలేదు అని. ఇది కూడా ఒక తారక మంత్రములాంటిది. జీవితములో అశాశ్వతములైన విషయములు వస్తాయి . ఇక్కడ కృష్ణుడు చెప్పినట్లు అతువంటి వాటిని 'తితిక్షస్వ, అనుకుంటూ భరించడము ఒక మార్గము.

అయితే ఆ దుఃఖములు భరిస్తే ఏమి ప్రయోజనము అన్న ప్రశ్న మళ్ళీ వెంటనే వస్తుంది. దానికి కృష్ణుడు ఇలా సమాధానము ఇస్తాడు:

||శ్లోకము 15||

యం హి న వ్యధయన్త్యేతే పురుషం పురుషర్షభ|
సమ దుఃఖ సుఖం ధీరం సోఽమృతత్వాయ కల్పతే ||15||

స|| హే పురుషర్షభ ! ఏతే సమ దుఃఖం సుఖం ధీరం యం పురుషం న వ్యధయంతి సః ( పురుషః ) అమృతత్వాయ ( మోక్షాయ) కల్పతే||15||

||శ్లోకార్థములు||
పురుషర్షభ - పురుషులలో శ్రేష్ఠుడా
ఏతే సమ దుఃఖం సుఖం - ఇవి సుఖదుఃఖములు సమము చూచునట్టి
ధీరం - ధైర్యశాలియగు
యం పురుషం న వ్యధయంతి - ఏ పురుషుని బాధించవో
సః అమృతత్వాయ కల్పతే - అతడు మోక్షమునకు అర్హుడు.

||శ్లోక తాత్పర్యము||

"ఓ పురుషులలో శ్రేష్ఠుడవు అగు అర్జునా,
ఇవి సుఖదుఃఖములు సమము చూచునట్టి ధైర్యశాలియగు ఏ పురుషుని బాధించవో
అతడు మోక్షమునకు అర్హుడు".||15||

ఎవరిని అయితే-"ఏతే" అంటే ఈ శీతోష్ణ సుఖదుఃఖాలు "న వ్యధయన్తి" - భాధించవో, ఇంకా ఎవరు "సమ దుఃఖ సుఖం"-
సుఖాలు దుఃఖాలమీద సమము గా ఉంటాడో అట్టి వాడు, అంటే అట్టి వివేకము గలవాడు మోక్షమున కు అర్హుడవుతాడు.
అది కృష్ణుడు అన్నమాట.

||శ్లోకము 16||

నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః |
ఉభయోరపి దృష్టోఽన్తస్త్వనయోః తత్వ దర్శిభిః ||16||

స|| అసతః భావః న విద్యతే | సతః అభావః న విద్యతే |అనయోః ఉభయోః అపి అంతః తు తత్వ దర్శిభిః దృష్ఠః ||

||శ్లోకార్థములు||

అసతః భావః న విద్యతే - లేనిదానికి ఉన్నది అనే భావము లేదు
సతః అభావః న విద్యతే - వున్నదానికి లేదు అనే భావము లేదు
అనయోః ఉభయోః అపి అంతః తు - ఈ రెండింటి నిశ్చయమును
తత్వ దర్శిభిః దృష్ఠః - తత్త్వవేత్తలు గ్రహించి యున్నారు

||శ్లోక తాత్పర్యము||

"లేనిదానికి ఉన్నది అనే భావము లేదు. వున్నదానికి లేదు అనే భావము లేదు
ఈ రెండింటి నిశ్చయమును, తత్త్వవేత్తలు గ్రహించి యున్నారు".||16||

అసత్యములైన దేహాదులకు ఉనికి లేదు. ఎందుకు అంటే పుట్టుకముందు ఆ దేహము లేదు. అదే దేహము మరణాంతరము లేదు. అది శాశ్వతము కాదు. ఆత్మ ఒక్కటి యే శాశ్వతమైనది.

||శ్లోకము 17||

అవినాశితు తద్విద్ధి యేన సర్వ మిదం తతం |
వినాశ మవ్యయ స్యాస్య నకశ్చిత్ కర్తుమర్హతి ||17||

స|| ఇదం సర్వం యేన తతమ్ ( వ్యాపితం) తత్ తు అవినాశి (ఇతి) విద్ధి |అస్య అవ్యయస్య వినాశమ్ కశ్చిత్ కర్తుం న అర్హతి ||17||

||శ్లోకార్థములు||

ఇదం సర్వం యేన తతమ్- ఈ సమస్త ప్రపంచము దేని చేత వ్యాపింపబడినదో
తత్ తు అవినాశి (ఇతి) విద్ధి - అది నాశనము లేనిది అని తెలిసికొనుము
అస్య అవ్యయస్య - ఆ నాశనము లేని పదార్థమునకు
వినాశమ్ కర్తుం కశ్చిత్ న అర్హతి - నాశనము చేయుటకు ఎవరికి అర్హత లేదు

||శ్లోకతాత్పర్యములు||

"ఈ సమస్త ప్రపంచము దేని చేత వ్యాపింపబడినదో అది నాశనము లేనిది అని తెలిసికొనుము.
ఆ నాశనము లేని పదార్థమును నాశనము చేయుటకు ఎవరికి అర్హత లేదు "||17||

||శ్లోకము18||

అన్తవన్త ఇమే దేహాః నిత్యస్స్యోక్తాః శరీరిణః|
అనాశినోఽప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత ||18||

స|| నిత్యస్య అనాశినః అప్రమేయస్య శరీరిణః ( ఆత్మస్య) ఇమే దేహాః అన్త వన్తః (ఇతి) ఉక్తాః | తస్మాత్ యుధ్యస్వ ||

||శ్లోకార్థములు||

నిత్యస్య అనాశినః - నిత్యుడును నాశనము లేనివాడును
అప్రమేయస్య- అప్రమేయుని
శరీరిణః- శరీరములో వుండే ఆత్మ యొక్క
ఇమే దేహాః అన్త వన్తః (ఇతి) ఉక్తాః - ఈ దేహములు అంతము కలవిగా చెప్పబడినవి
తస్మాత్ యుధ్యస్వ - అందువలన ఓ అర్జునా యుద్ధము చేయుము.

||శ్లోకతాత్పర్యములు||

"నిత్యుడును నాశనము లేనివాడును
అప్రమేయుడగు శరీరములో వుండే ఆత్మ యొక్క ఈ దేహములు అంతము కలవిగా చెప్పబడినవి
అందువలన, ఓ అర్జునా యుద్ధము చేయుము".||18||

||శ్లోకము19||

య ఏనం వేత్తి హన్తారమ్ యశ్చైనం మన్యతే హతం |
ఉభౌ తౌ న విజానీతో నాయం హన్తి న హన్యతే ||19||

స||యః ఏనం (అత్మన్) హన్తారం వేత్తి యః ఏనం( అత్మన్) హతం మన్యతే తౌ ఉభౌ న విజానీతః |అయం ( అత్మ) న హంతి న హన్యతే చ ||19||

||శ్లోకార్థములు||

యః ఏనం (అత్మన్) హన్తారం వేత్తి - ఎవరు ఈ ఆత్మని చంపువానినిగా తెలిసికొనుచున్నరో
యః ఏనం( అత్మన్) హతం మన్యతే - ఎవరు ఈ ఆత్మను చంపబడినవానినిగా తెలుసుకొచున్నారో
ఉభౌ న విజానీతః - ఆ ఇద్దరికి తెలియదు
అయం ( అత్మ) న హంతి న హన్యతే చ - ఆ ఆత్మ చంపదు చంపబడదు

||శ్లోకతాత్పర్యములు||

"ఎవరు ఈ ఆత్మని చంపువానినిగా తెలిసికొనుచున్నరో, ఎవరు ఈ ఆత్మను చంపబడినవానినిగా తెలుసుకొచున్నారో ఆ ఇద్దరికి తెలియదు. ఈ ఆత్మ చంపదు చంపబడదు".||19||

ఈ ఆత్మచంపదు. చంపబడదు. ఈ ఆత్మకి కర్తుత్వము లేదు. కర్తుత్వము బుద్ధికి ఉంటుంది. ఆత్మ ఆ బుద్ధికి కేవలము సాక్షి మాత్రమే.

ఈ శ్లోకము లో రెండవపాదము కఠోపనిషత్తులో కూడా వస్తుంది. భగవద్గీత ఉపనిషత్తుల సారము అనడానికి ఇది నిదర్శనము అనుకోవచ్చు.

||శ్లోకము 20||

న జాయతే మ్రియతే వా కదాచిత్
నాయం భూత్వా భవితా వా న భూయః |
అజో నిత్య శ్శాశ్వతోఽయం పురాణో
న హన్యతే హన్యమానే శరీరే ||20||

స|| అయమ్ ( ఆత్మా) కదాచిత్ న జాయతే | న మ్రియతే వా | న భూత్వా భూయః న భవితాన | అయం అజః నిత్యః | శాశ్వతః | పురాణః |శరీరే హన్యమానే (సతి) న హన్యతే ||20||

||శ్లోకార్థములు||

అయమ్ ( ఆత్మా) కదాచిత్ న జాయతే - ఆత్మ ఎప్పుడు పుట్టుట లేదు
న మ్రియతే వా - చనిపోవుటయు లేదు
న భూత్వా భూయః న భవితాన - ఒకప్పుడు వుండి ఇక లేకపోవడము లేదు
అయం అజః నిత్యః - ఇతడు పుట్టుక లేనివాడు.
శాశ్వతః పురాణః - ఎల్లప్పుడు వుండువాడు. పురాతనుడు.
శరీరే హన్యమానే (సతి) న హన్యతే - శరీరము చంపబడిననూ చంపబడుటలేదు.

||శ్లోకతాత్పర్యములు||

"ఆత్మ ఎప్పుడు పుట్టుట లేదు. చనిపోవుటయు లేదు.
ఒకప్పుడు వుండి ఇక లేకపోవడము లేదు. ఇతడు పుట్టుక లేనివాడు.
ఎల్లప్పుడు వుండువాడు. పురాతనుడు. శరీరము చంపబడిననూ చంపబడుటలేదు".||20||

ఇది ఆత్మ గురించి. ఆత్మకి పుట్టుక మరణము రెండు లేవు.
ఇదే శ్లోకము యథాతథముగా కఠోపనిషత్తులో చెప్పబడినది.

||శ్లోకము 21||

వేద వినాశినం నిత్యం య ఏన మజ మవ్యయమ్|
కథం స పురుషః పార్థ కం ఘాతయతి హన్తి కం ||21||

స|| హే పార్థ ! యః యేనం ( ఆత్మన్) అజమ్ అవ్యయం (వేద) అవినాశినం (వేద) నిత్యం వేద సః పురుషః కథం (ఘాతయతి) కం ఘాతయతి కం హన్తి ||21||

||శ్లోకార్థములు||

యః యేనం ( ఆత్మన్) అజమ్ - ఎవరు ఈ ఆత్మను పుట్టుకలేనిదానిని గా
అవ్యయం అవినాశినం - క్షయములేని దానినిగాను నాశనము లేదానిని గాను
నిత్యం వేద - నిత్యునిగను తెలిసికొనుచున్నాడో
సః పురుషః కథం - అట్టిపురుషుడు ఎట్లు
కం హన్తి - ఎవరిని చంపును

||శ్లోకతాత్పర్యము||

"ఎవరు ఈ ఆత్మను పుట్టుకలేనిదానినిగనూ, క్షయములేని దానినిగాను, నాశనము లేదానిని గాను,
నిత్యునిగను తెలిసికొనుచున్నాడో, అట్టిపురుషుడు ఎట్లు ఎవరిని చంపును"||21||

||శ్లోకము 22||

వాసాంసి జీర్ణాని యథా విహాయ
నవాని గృహ్ణాతి నరోఽపరాణి|
తథా శరీరాని విహాయ జీర్ణాన్
అన్యాని సంయాతి నవాని దేహే||22||

స|| యథా నరః జీర్ణాని వాసాంసి విహాయ అపరాణి నవాని వాసాంసి గృహ్ణాతి తథా దేహీ ( ఆత్మన్) శరీరాణి విహాయ అన్యాని నవాని శరీరాణి సంయాతి ||22||

||శ్లోకార్థములు||

యథా నరః - ఏ విధముగా నరుడు
జీర్ణాని వాసాంసి విహాయ - చినిగిపోయిన వస్త్రములను వదిలి
అపరాణి నవాని వాసాంసి గృహ్ణాతి - ఇంకొక కొత్త వస్త్రములను తీసికొనునో
తథా దేహీ ( ఆత్మన్) శరీరాణి విహాయ- అదేవిధముగా దేహములోని ఆత్మ ఈ శరీరము వదిలి
అన్యాని నవాని శరీరాణి సంయాతి - ఇంకొక కొత్త శరీరమును పొందును.

||శ్లోకతాత్పర్యము||

"ఏ విధముగా నరుడు చినిగిపోయిన వస్త్రములను వదిలి
ఇంకొక కొత్త వస్త్రములను తీసికొనునో, అదేవిధముగా దేహములోని ఆత్మ ఈ శరీరము వదిలిఇంకొక కొత్త శరీరమును పొందును".||22||

||శ్లోకము 23||

నైనం చిన్దన్తి శస్త్రాణి నైనం దహతి పావకః |
న చైనం క్లేదయన్త్యాపో న శోషయతి మారుతః ||23||

స|| ఏనం( ఆత్మన్) శస్త్రాణి న చిన్దన్తి | పావకః ఏనం( అత్మన్) న దహతి | ఆపః చ ఏనం( ఆత్మన్) న క్లేదయంతి | ఏనం ఆత్మన్ మారుతః న శోషయతి ||23||

||శ్లోకార్థములు||

ఏనం( ఆత్మన్) శస్త్రాణి న చిన్దన్తి - దీనిని( ఆత్మని) శస్త్రములు ఛేదింపజాలవు
పావకః ఏనం( అత్మన్) న దహతి - అగ్ని దీనిని దహింపజాలదు
ఆపః చ ఏనం( ఆత్మన్) న క్లేదయంతి - నీరు దీనిని తడుపజాలదు
ఏనం ఆత్మన్ మారుతః న శోషయతి - దీనిని వాయువు ఎండింప జాలదు

||శ్లోకతాత్పర్యము||

"ఈ ఆత్మని శస్త్రములు ఛేదింపజాలవు
అగ్ని దీనిని దహింపజాలదు. నీరు దీనిని తడుపజాలదు
దీనిని వాయువు ఎండింప జాలదు".||23||

||శ్లోకము 24||

అచ్ఛేద్యోఽయం అదాహ్యోఽయం అక్లేద్యోఽశోష్య ఏవచ |
నిత్య సర్వ గతః స్థాణుః అచలోఽయం సనాతనః ||24||

స|| అయం( అత్మా) అచ్ఛేద్యః | అయమ్ ( అత్మా) అదాహ్యః | (అయం అత్మా) అక్లేద్యః| ( అయం అత్మా) అశోష్యః ఏవ చ |అయం నిత్యః | అయం సర్వగతః | అయం స్థాణుః | అయం అచలః | అయం సనాతనః ||24||

||శ్లోకార్థములు||

అయం( అత్మా) అచ్ఛేద్యః - ఈ ఆత్మ ఛేదింపబడజాలదు
అయమ్ ( అత్మా) అదాహ్యః - ఈ ఆత్మ దహింపబడజాలదు
(అయం అత్మా) అక్లేద్యః- ఈ ఆత్మ తడుపబడజాలదు
అశోష్యః ఏవ చ - ఏండింపజాలబడడును
అయం నిత్యః సర్వగతః స్థాణుః - ఈ ఆత్మ నిత్యమైనది సర్వత్రవ్యాపించియున్నది, స్థిరమైనది
అయం అచలః సనాతనః - ఈ ఆత్మ అచలమైనది సనాతనమైనది

||శ్లోకతాత్పర్యము||

"ఈ ఆత్మ ఛేదింపబడజాలదు, దహింపబడజాలదు, తడుపబడజాలదు.ఏండింపజాలబడదు.
ఈ ఆత్మ నిత్యమైనది సర్వత్రవ్యాపించియున్నది, స్థిరమైనది. ఈ ఆత్మ అచలమైనది సనాతనమైనది".||24||

||శ్లోకము 25||

అవ్యక్తోఽయం అచింత్యోఽయమ్ అవికార్యోఽయముచ్యతే|
తస్మాత్ ఏవం విదిత్వైనం నాను శోచితు మర్హసి ||25||

స|| అయం అత్మా అవ్యక్తః అయం అచిన్త్యః అయం అవికార్యః ఇతి ఉచ్యతే | తస్మాత్ ఏనం (అత్మన్) ఏవం విదిత్వా అనుశోచితుం న అర్హసి |

||శ్లోకార్థములు||

అయం అత్మా అవ్యక్తః - ఈ ఆత్మ అవ్యక్తమైనది
అయం అచిన్త్యః అయం అవికార్యః - మనస్సుచే చింతింప అలవికానిది.
అవికార్యః ఇతి ఉచ్యతే - వికారము పొందనిది అని చెప్పబడుచున్నది
తస్మాత్ ఏనం (అత్మన్) ఏవం విదిత్వా - అందువలన ఆత్మను ఈ విధముగా తెలిసికొని
అనుశోచితుం న అర్హసి- దుఃఖించుటకు తగవు.

||శ్లోకతాత్పర్యము||

"ఈ ఆత్మ అవ్యక్తమైనది మనస్సుచే చింతింప అలవికానిది, వికారము పొందనిది అని చెప్పబడుచున్నది. అందువలన ఆత్మను ఈ విధముగా తెలిసికొని దుఃఖించుటకు తగదు".||25|| (?)

అంటే కృష్ణుడు అన్నమాట "ఈ ఆత్మ ఇంద్రియములకు గోచరము కానిది. మనసు చే చింతింప శక్యము కానిది. నిర్వికారముకలది. అది తెలిసికొని నీవు చింతింప తగదు" అని.

కృష్ణుడు ఆత్మ గురించి ఇంతాచెప్పి, మళ్ళీ పొనీ ఈ ఆత్మ నిత్యము కాదు అనిత్యమే అనుకుందాము. అలా అయినాగాని నీవు దుఃఖించడానికి తగదు (2.26) అని.

||శ్లోకము 26||

అథ చైనం నిత్య జాతం నిత్యం వా మన్యసే మృతం|
తథాపి త్వమ్ మహాబాహో నైవం శోచితు మర్హసి ||26||

స|| హే మహాబాహో ! అథ చ ఏనం (అత్మన్) నిత్య జాతం వా నిత్యం మృతం వా మన్యసే తథా అపి ఏవమ్ శోచితుమ్ త్వం న అర్హసి ||26||

||శ్లోకార్థములు||

అథ చ ఏనం (అత్మన్) - ఒక వేళ ఈ ఆత్మను
నిత్య జాతం వా నిత్యం మృతం - ఎల్లప్పుడు పుట్టుకకలదానినిగా లేక
నిత్యం మృతం మన్యసే - ఎల్లప్పుడు మరణము కలదానినిగా తలంతు వేని
తథా అపి ఏవమ్ శోచితుమ్- అప్పుడు కూడా ఈ విధముగా దుఃఖపడుట
త్వం న అర్హసి - నీకు తగదు

||శ్లోకతాత్పర్యము||

"గొప్పబాహువులు కల అర్జునా, ఒక వేళ ఈ ఆత్మను ఎల్లప్పుడు పుట్టుక కలదానినిగా లేక,
ఎల్లప్పుడు మరణము కలదానినిగా తలంతు వేని,
అప్పుడు కూడా ఈ విధముగా దుఃఖపడుట నీకు తగదు".||26||

ఎందుకు దుఃఖించతగదో ముందు శ్లోకములో వస్తుంది.

||శ్లోకము 27||

జాతస్య హి ధ్రువోమృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ |
తస్మాదపరిహార్యేఽర్థే న త్వం శోచితు మర్హసి ||27||

స|| జాతస్య మృత్యుః ధృవః హి | మృతస్య జన్మ చ ధృవం | తస్మాత్ అపరిహార్యే అర్థే త్వం శోచితుమ్ న అర్హసి ||27||

||శ్లోకార్థములు||

జాతస్య మృత్యుః ధృవః హి- పుట్టినవానికి మరణము తథ్యము కదా.
మృతస్య జన్మ చ ధృవం - మరణించినవానికి పుట్టుక నిశ్చయము.
తస్మాత్ అపరిహార్యే అర్థే - అందువలన తప్పించుకోలేని ఈ విషయములో
త్వం శోచితుమ్ న అర్హసి - నీకు శోకము తగదు

||శ్లోకతాత్పర్యము||

"పుట్టినవానికి మరణము తథ్యము కదా. మరణించినవానికి పుట్టుక నిశ్చయము.
అందువలన తప్పించుకోలేని ఈ విషయములో నీకు శోకము తగదు".||27||

||శ్లోకము 28||

అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత |
అవ్యక్త నిధనాన్యేన తత్ర కా పరిదేవనా ||28||

స|| హే భారత ! భూతాని అవ్యక్తాదీని వ్యక్త మధ్యాని అవ్యక్త నిధనాన్యేవ ( భవంతి) | తత్ర పరిదేవనా కా ||28||

||శ్లోకార్థములు||

భూతాని అవ్యక్తాదీని - ప్రాణులు మొదటిలో అవ్యక్తముగా వుండునవి
వ్యక్త మధ్యాని - మధ్యలో వ్యక్తమగునవి
అవ్యక్త నిధనాన్యేవ - నిధనము తర్వాత అవ్యక్తముగా వుండునవి.
తత్ర పరిదేవనా కా - ఆ విషయమున దుఃఖము ఏల?

||శ్లోకతాత్పర్యము||

"ఓ అర్జున, ప్రాణులు మొదటిలో అవ్యక్తముగా వుండునవి, మధ్యలో వ్యక్తమగునవి, మరల నిధనము తర్వాత అవ్యక్తముగా వుండునవి. ఆ విషయమున దుఃఖము ఏల?" ||28||

అంటే దేహము కనపడని స్థితిలోనుంచి వచ్చి మళ్ళీ కనపడని స్థితిలోకి వెళ్ళాడన్నమాట . అలాంటి దానిగురించి దుఃఖము ఎందుకు అని.(2.28)

||శ్లోకము 29||

అశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం
ఆశ్చర్యవత్ వదతి తథైవ చాన్యః|
ఆశ్చర్యవచ్చైన మన్య శ్రుణోతి
శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్ ||29||

స||కశ్చిత్ ఏనం (ఆత్మన్) అశ్చర్యవత్ పశ్యతి | తథైవ కశ్చిత్ ఏనం (ఆత్మన్) అశ్చర్యవత్ వదతి | అన్యః చ ఏనం (ఆత్మన్) ఆశ్చర్యవత్ శృణోతి | శ్రుత్వా అపి ఏనం కశ్చిత్ చ న వేద ఏవ ||29||

||శ్లోకార్థములు||

కశ్చిత్ ఏనం (ఆత్మన్) అశ్చర్యవత్ పశ్యతి - కొందరు ఆత్మని ఆశ్చర్యమైనదానిని వలె చూచెదరు
తథైవ కశ్చిత్ ఏనం (ఆత్మన్) అశ్చర్యవత్ వదతి - అలాగె కొందరు అశ్చర్యమైనదానిని వలె చెప్పుదురు
అన్యః చ ఏనం (ఆత్మన్) ఆశ్చర్యవత్ శృణోతి -మరి కొందరు అశ్చర్యమైనదాని ని వలె వినెదరు.
శ్రుత్వా అపి ఏనం కశ్చిత్ చ న వేద ఏవ -విని కూడా ఎవరును దీనిని తెలిసికొనుటలేదు.

||శ్లోకతాత్పర్యము||

"కొందరు ఆత్మని ఆశ్చర్యమైనదానిని వలె చూచెదరు
అలాగే కొందరు అశ్చర్యమైనదానిని వలె చెప్పుదురు
మరి కొందరు అశ్చర్యమైనదానిని వలె వినెదరు.
విని కూడా ఎవరును దీనిని తెలిసికొనుటలేదు"||29||

||శ్లోకము 30||

దేహే నిత్యమవధ్యోఽయం దేహే సర్వస్య భారత |
తస్మాత్ సర్వాణి భూతాని న త్వం శోచితుమర్హసి || 30||

స|| హే భారత ! సర్వస్య దేహే అయం దేహీ ( అత్మా) నిత్యం అవధ్యః | తస్మాత్ సర్వాణి భూతాని త్వం శోచితుం న అర్హసి ||30||

||శ్లోకార్థములు||

సర్వస్య దేహే అయం దేహీ - సమస్త దేహములలో ను ఈ ఆత్మ
నిత్యం అవధ్యః - ఎల్లప్పుడు చంపబడనివాడు
తస్మాత్ సర్వాణి భూతాని - అందువలన సమస్త ప్రాణుల గురించి
త్వం శోచితుం న అర్హసి - నీవు దుఃఖించుట తగదు

||శ్లోకతాత్పర్యము||

"ఓ భారత, సమస్త దేహములలో ను ఈ ఆత్మ ఎల్లప్పుడు చంపబడనివాడు. అందువలన సమస్త ప్రాణుల గురించి నీవు దుఃఖించుట తగదు".||30||

ఈ ఆత్మ అన్నది సులభముగా అందరికీ అర్థము అవ్వదు. ఈ ఆత్మ కనపడనిది కనుక అందరికీ ఆశ్చర్యమే అవుతుంది
"దేహీ" అంటే దేహములో ఉండేది, అదే ఈ ఆత్మ. అట్టి ఆత్మ నిత్యము. చంపబడనిది. దేహమును వధించినా దేహి వధింపబడదు. అందుకని కూడా దుఃఖము వలదు అని. ఇప్పుటి దాకా చెప్పినది అంతా పారమార్థికముగా దుఃఖము వలదు అని చెప్పడము అయింది..

అయితే ఈ పరమార్థతత్త్వము అందరికి అర్థము అవదు. ఈ పారమార్థిక తత్త్వము సంగతి వదిలేసి, ఇంకో విధముగా కూడా ఆలోచించవచ్చు. ఇప్పుడు కృష్ణుడు అదే చెపుతాడు.

ఈ కొత్త ధోరణిలో కృష్ణుడు పారమార్థికముగా కాక తన స్వధర్మమును అనుసరించి చూడమని, అలా చూచినా అర్జునుడు తన ధర్మము నుంచి చలించరాదని చెపుతాడు.

||శ్లోకము 31||

స్వధర్మపి చావేక్ష్య న వికమ్పితు మర్హసి |
ధర్మ్యాద్ధి యుద్ధాత్ శ్రేయోఽన్యత్ క్షత్రియస్య నవిద్యతే ||31||

స|| స్వధర్మం అవేక్ష్య వికమ్పితుం న అర్హసి చ | క్షత్రియస్య ధర్మ్యాత్ యుద్ధాత్ అన్యత్ శ్రేయః న విద్యతే ||31||

||శ్లోకార్థములు||

స్వధర్మం అవేక్ష్య - స్వకీయ ధర్మమును చూచినను
వికమ్పితుం న అర్హసి చ - చలించుటకు తగదు
క్షత్రియస్య ధర్మ్యాత్ - క్షత్రియ ధర్మమును అనుసరించి
యుద్ధాత్ అన్యత్ శ్రేయః - యుద్ధమునకు కన్న శ్రేయస్కరమైనది ఇంకొకటి
న విద్యతే హి - లేదు కదా

||శ్లోకతాత్పర్యము||

"స్వకీయ ధర్మమును చూచినను చలించుటకు తగదు.
క్షత్రియ ధర్మమును అనుసరించి యుద్ధమునకు కన్న శ్రేయస్కరమైనది ఇంకొకటి లేదు కదా".||31||

ఇక్కడ కృష్ణుడు పారమార్థికముగా కాక, తన స్వధర్మమును అనుసరించి చూచినా, అర్జునుడు తన ధర్మము నుంచి చలించరాదని చెపుతాడు.

యుద్ధము క్షత్రియ ధర్మము. యుద్ధము చేసి స్వర్గమును పొందే అవకాశము అదృష్టవంతులకే దొరుకుతుంది. స్వధర్మము విడిచి యుద్ధము చేయకపోతే అపకీర్తిపొందుతావు. యుద్ధములో హతమైతే స్వర్గము పొందుతావు. యుద్ధములో గెలిస్తే ఈ భూమిని అనుభవిస్తావు అని. అదే కృష్ణుడు చెపుతాడు.

||శ్లోకము 32||

యదృచ్చయా చోపపన్నం స్వర్గద్వారమపావృతమ్|
సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధ మీదృశమ్ ||32||

స|| హే పార్థ! యదృచ్ఛయా ఉపపన్నమ్ అపావృతం స్వర్గద్వారం ఈదృశమ్ యుద్ధం (యే) క్షత్రియాః లభన్తే తే సుఖినః ||32||

||శ్లోకార్థములు||

యదృచ్ఛయా ఉపపన్నమ్ - తనంతట తాను సంప్రాప్తమైన
అపావృతం స్వర్గద్వారం - తెరవబడిన స్వర్గ ద్వారమువంటి
ఈదృశమ్ యుద్ధం - ఈ విధమైన యుద్ధము
(యే) క్షత్రియాః లభన్తే- యే క్షత్రియులకు లభించునో ( వారు)
తే సుఖినః - వారు సుఖవంతులు

||శ్లోకతాత్పర్యము||

"తనంతట తాను సంప్రాప్తమైన, తెరవబడిన స్వర్గ ద్వారమువంటి
ఈ విధమైన యుద్ధము యే క్షత్రియులకు లభించునో వారు సుఖవంతులు".||32||

||శ్లోకము 33||

అథ చేత్త్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి |
తతః స్వధర్మం కీర్తించ హిత్వా పాప మవాప్ససి ||33||

స|| అథ త్వం ఇమమ్ ధర్మ్యం సంగ్రామమ్ న కరిష్యతి చేత్ తతః స్వధర్మం కీర్తించ హిత్వా పాపం అవాప్స్యసి ||33||

||శ్లోకార్థములు||

అథ త్వం ఇమమ్ - ఒకవేళ నువ్వు
ధర్మ్యం సంగ్రామమ్ న కరిష్యతి - ధర్మబద్ధమైన సంగ్రామము చెయకపోయినచో,
తతః స్వధర్మం కీర్తించ హిత్వా - అప్పుడు స్వధర్మను కీర్తిని పొగొట్టుకొని
పాపం అవాప్స్యసి - పాపము పొందెదవు

||శ్లోకతాత్పర్యము||

"ఒకవేళ నువ్వు ధర్మబద్ధమైన సంగ్రామము చేయకపోయినచో
అప్పుడు స్వధర్మను కీర్తిని పొగొట్టుకొని పాపము పొందెదవు"||33||

కురుక్షేత్రములో యుద్ధమునకు సిద్ధము అవుతున్న సందర్భములో, ఇదే ధోరణిలో, కుంతీదేవి కృష్ణుడితో అర్జునునికి భీమునకు ఒక మాట గుర్తు చేయమని చెపుతుంది; అది,' ఓ కృష్ణా, దేని నిమిత్తము క్షత్రియ మాత కొమరుని గనుచున్నదో, అట్టి సందర్భము ఏతెంచినది అని అర్జునితోనూ , నిరంతరము యుద్ధసన్నద్ధుడగు భీమునితోను చెప్పుము." అని. ఇప్పుడు కృష్ణుడు క్షత్రియధర్మము గురించి అదే ధోరణిలో చెప్పుచున్నాడు.

||శ్లోకము 34||

అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తేఽవ్యయామ్ |
సంభావితస్య చా కీర్తిః మరణాదతిరిత్యతే ||34||

స|| భూతాని తే అవ్యయాం అకీర్తిం కథయిష్యంతి అపి చ | సంభావితస్య అకీర్తిః మరణాత్ చ అతిరిచ్యతే (అధికం భవతి) ||34||

||శ్లోకార్థములు||

భూతాని తే అవ్యయాం - ప్రాణులు నీయొక్క చిరకాలము ఉండు
అకీర్తిం కథయిష్యంతి అపి చ - అపకీర్తిని చెప్పుకొనెదరు కూడా
సంభావితస్య అకీర్తిః - గౌరవింపబడినవానికి అపకీర్తి
మరణాత్ చ అతిరిచ్యతే - మరణము కన్న అధికము

||శ్లోకతాత్పర్యము||

"ప్రాణులు నీయొక్క చిరకాలము ఉండు అపకీర్తిని చెప్పుకొనెదరు కూడా.
గౌరవింపబడినవానికి అపకీర్తి మరణము కన్న అధికము".||34||

||శ్లోకము 35||

భయాద్రణా దుపరతంమన్యన్తే త్వాం మహరథాః|
యేషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవమ్||35||

స|| యేషామ్ త్వం బహుమతః భూత్వా లాఘవం యాస్యసి (తే) మహారథాః త్వామ్ రణాత్ భయాత్ ఉపరతం మన్యన్తే చ ||35||

||శ్లోకార్థములు||

యేషామ్ త్వం బహుమతః భూత్వా- ఎవరిలో నీవు గౌరవింపబడినవాడవు అయితివో
లాఘవం యాస్యసి - ( వారిలో) చులకన పొందెదవు
మహారథాః త్వామ్ రణాత్ - ఆ మహారథులు ( నిన్ను) రణమునుంచి
భయాత్ ఉపరతం మన్యన్తే చ - భయముతో రణమునుంచి మరలినవానిగా తలంతురు

||శ్లోకతాత్పర్యము||

"ఎవరిలో నీవు గౌరవింపబడినవాడవు అయితివో వారిలో చులకన పొందెదవు.
ఆ మహారథులు ( నిన్ను) రణమునుంచి భయముతో రణమునుంచి మరలినవానిగా తలంతురు".||35||

||శ్లోకము 36||

అవాచ్య వాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః |
నిన్దన్తస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిమ్||36||

స|| తవ అవహితాః ( శత్రుః) తవ సామర్థ్యం నిందన్తః బహూన్ అవాచ్య వాదాంశ్చ వదిష్యంతి | తతః దుఃఖతరం కిమ్?||36||

||శ్లోకార్థములు||

తవ అవహితాః - నీ శత్రువులు
తవ సామర్థ్యం నిందన్తః - నీ సామర్థ్యము నిందించెదరు
బహూన్ అవాచ్య వాదాంశ్చ వదిష్యంతి -
అనేకమైన అనరాని మాటలుచెప్పెదరు
తతః దుఃఖతరం కిమ్?- అంతకన్న దుఃఖమైనది ఏమి కలదు?

||శ్లోకతాత్పర్యములు||

"నీ శత్రువులు నీ సామర్థ్యము నిందించెదరు. అనేకమైన అనరాని మాటలుచెప్పెదరు
అంతకన్న దుఃఖమైనది ఏమి కలదు?" ||36||

||శ్లోకము 37||

హతో వా ప్రాప్స్యసే స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీమ్|
తస్మాదుత్తిష్ట కౌన్తేయ యుద్ధాయ కృత నిశ్చయః ||37||

స|| హే కౌన్తేయ ! హతో వా స్వర్గం ప్రాప్యసే | జిత్వా వా మహీమ్ భోక్ష్యసే | తస్మాత్ యుద్ధాయ కృత నిశ్చయః ఉత్తిష్ఠ ||37||

||శ్లోకార్థములు||

హతో వా స్వర్గం ప్రాప్యసే - చనిపోయినచో స్వర్గము పొందెదవు
జిత్వా వా మహీమ్ భోక్ష్యసే - జయముపొందినచో రాజ్యము అనుభవించెదవు
తస్మాత్ యుద్ధాయ కృత నిశ్చయః - అందువలన యుద్ధమునకు నిశ్చయముకలవాడవై
ఉత్తిష్ఠ- లెమ్ము.

||శ్లోకతాత్పర్యములు||

"చనిపోయినచో స్వర్గము పొందెదవు. జయముపొందినచో రాజ్యము అనుభవించెదవు.
అందువలన యుద్ధమునకు నిశ్చయము కలవాడవై లెమ్ము"||37||

ఇక్కడ మళ్ళీ "ఉత్తిష్ఠ" అంటూ అర్జునిడికి పురికొలుపుతున్నాడు కృష్ణుడు. అంతేకాదు, స్వధర్మము పాటించే వాళ్ళు, తమ ధర్మము ఎలా పాటించాలి అని చెపుతున్నాడు.

ఈ శ్లోకము ఒక మహామంత్రము అని చెప్పబడినది. సాధనలో నిరుత్సాహము చెందిన వారు ఈ శ్లోకము పఠించినచో ధైర్యము సమకూడును అని. అయితే సాధనలో జయాపజయాలు ఏమిటి?. జయము మోక్షము. అపజయము మోక్షము సంపాదించలేక పోవడము. సాధనలో అపజయము పొందినా, మోక్షము కోసము చేసిన యుద్ధము ధర్మయుద్ధము. అటువంటివారు అపజయము పొందినా, ఉత్తమగతి పొందుతారు.

||శ్లోకము 38||

సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ |
తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి||38||

స|| సుఖ దుఃఖే లాభా లాభౌ జయా జయౌ సమేకృత్వా తతః యుద్ధాయ యుజ్యస్వ| ఏవమ్ ( చేత్) పాపం న అవాప్స్యసి||38||

||శ్లోకార్థములు||

సుఖ దుఃఖే లాభాలాభౌ - సుఖదుఃఖములను లాభనష్టములను
జయా జయౌ సమేకృత్వా - జయము అపజయములను సమానముగా తలంచి
తతః యుద్ధాయ యుజ్యస్వ- అప్పుడు యుద్ధమునకు తయారుకమ్ము
ఏవమ్ ( చేత్) పాపం న అవాప్స్యసి-అట్లు చేసినచో పాపమును పొందవు

||శ్లోకతాత్పర్యములు||

"సుఖదుఃఖములను లాభానష్టములను జయము అపజయములను సమానముగా తలంచి
అప్పుడు యుద్ధమునకు తయారుకమ్ము. అట్లు చేసినచో పాపమును పొందవు".||38||

"సుఖ దుఃఖ ములందును జయాపజయము లందును సమ బుద్ధి కలిగి యుద్ధమునకు సంసిద్ధుడవు కమ్ము. అట్లైన నీవు ఎటు వంటి పాపమును పొందవు " అని.

ఈ విధముగా ముందు ఆత్మస్వరూప జ్ఞానము చెప్పి, ఎందుకు శోకించరాదు అన్నమాట సాంఖ్యయోగము ఉపదేశము ద్వారా అర్జునినికి బోధిస్తాడు. తరువాత స్వధర్మమును అనుసరించికూడా శోకము వలదు అని కృష్ణుడు బోధిస్తాడు.

||శ్లోకము 39||

ఏషా తేఽభిహితే సాంఖ్యే బుద్ధి ర్యోగే త్విమాం శ్రుణు |
బుద్ధ్యాయుక్తో యయా పార్థ కర్మబన్ధం ప్రహాస్యసి ||39||

స|| హే పార్థ ! సాంఖ్యే ఏషా బుద్ధిః తే అభిహితా | యయా బుద్ధ్యా యుక్తః కర్మబంధం ప్రహాస్యసి తాం యోగేతు ఇమాం శృణు||39||

||శ్లోకార్థములు||

సాంఖ్యే ఏషా బుద్ధిః - సాంఖ్యములో చెప్పబడిన ఈ జ్ఞానమును
తే అభిహితా - నీకు చెప్పబడినది.
యయా బుద్ధ్యా యుక్తః - ఎట్టి వివేకముతో కూడి
కర్మబంధం ప్రహాస్యసి - కర్మ బంధనములను వదలగలవో
తాం యోగేతు ఇమాం శృణు- అట్టి యోగమును ఇప్పుడు వినుము

||39||

||శ్లోకతాత్పర్యములు||

"సాంఖ్యములో చెప్పబడిన ఈ జ్ఞానమును నీకు చెప్పబడినది.
ఎట్టి వివేకముతో కూడి కర్మ బంధనములను వదలగలవో అట్టి యోగమును ఇప్పుడు వినుము".||39||

అయితే కృష్ణుడు సాంఖ్యయోగము బోధించి ఆగిపోలేదు. సాంఖ్యములో బోధించిన ఆత్త్మజ్ఞానము కలగాలి. ఈ ఆత్మ జ్ఞానము చెపితే లేక వింటే వచ్చే జ్ఞానము కాదు. వేలకొలది మనుష్యులలో ఒకడికే ఆత్మ సాక్షాత్కారమౌతుంది . అలా అయితే ఈ జ్ఞానము ఎలా కలుగుతుంది అన్న ప్రశ్న వస్తుంది.

ఆ జ్ఞానము కర్మబంధనములనుంచి బయటపడితే యోగబుద్ధి ద్వారా కలుగుతుంది.

అందుకే కృష్ణభగవానుడు ఇక్కడ కర్మ యోగముగురించి అంటే కర్మ బంధనములనుంచి విడివడగల యోగాన్ని విశదీకరిస్తాడు.

దేనిమీద అయినా ప్రేరణ కలగడానికి ముందు దాని గొప్పదనము తెలియాలి. అందుకని కర్మయోగము ఎట్లా అనుష్ఠానము చేయ్యాలి అన్నది వదిలేసి, కృష్ణ భగవానుడు కర్మయోగము యొక్క మహిమ గురించి ఇట్లు చెప్పెను.

అదిమహత్తరమైన విషయము.

||శ్లోకము 40||

నేహాభి క్రమనాశోఽస్తి ప్రత్యవాయో నవిద్యతే |
స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్ ||40||

స|| ఇహ ( కర్మయోగే) అభిక్రమ నాశః న అస్తి | ప్రత్యవాయః న విద్యతే | అస్య ధర్మస్య స్వల్పమపి మహతః భయాత్ త్రాయతే ||40||

||శ్లోకార్థములు||

ఇహ ( కర్మయోగే) అభిక్రమ నాశః న అస్తి - ఇక్కడ ప్రారంభించినది నిష్ఫలమగుట లేదు
ప్రత్యవాయః న విద్యతే - దోషమును లేదు
అస్య ధర్మస్య స్వల్పమపి - ఈ ధర్మము యొక్క లేశమైనను
మహతః భయాత్ త్రాయతే- మహత్తరమైన భయము నుంచి రక్షించుచున్నది

||శ్లోకతాత్పర్యములు||

"ఇక్కడ ప్రారంభించినది నిష్ఫలమగుట లేదు. దోషమును లేదు.
ఈ ధర్మము యొక లేశమైనను మహత్తరమైన భయము నుంచి రక్షించుచున్నది".||40||

ఈ కర్మయోగములో, 'అభిక్రమనాశః' అంటే ప్రారంభించినది నాశనమగుట నిష్ఫలమగుట లేదు.
'ప్రత్యవాయో', అంటే దోషము అన్నమాట కూడా లేదు.

అంటే నిష్కామ కర్మ మొదలెట్టితే నిష్ఫలము అవ్వడము లేదు.
ఇంకోమాట. ఈ నిష్కామ కర్మ కొంచెము చేసిననూ, 'త్రాయతే మహతః భయాత్', మహత్తరమైన భయము నుంచి రక్షించును.

ఎంత చిన్నపని అయిననూ, నిష్కామముతో చేసినచో అది జీవుని సంసారభయమునుంచి రక్షించును.
అంటే నిష్కామ కర్మ చేయునివానికి సంసార బంధనముల గురించి భయము తొలగుట ఒక మహత్తర భాగ్యము.

అయితే ఈ కర్మయోగానుష్ఠానమునకు, అంటే అనుసరించడానికి కావలసిన విద్య ఏమిటి? అది కూడా చెపుతాడు కృష్ణుడు.

||శ్లోకము 41||

వ్యవసాయాత్మికా బుద్ధిః ఏకేహ కురునన్దన |
బహుశాఖాః అనన్తాశ్చ బుద్ధయోఽవ్యవసాయినామ్||41| ???

స|| హే కురునందన !ఇహ వ్యవసాయాత్మికా బుద్ధిః ఏకా (ఏవ) | అవ్యవసాయినామ్ బుద్ధయః బహుశాఖాః అనన్తాశ్చ హి||

||శ్లోకార్థములు||

ఇహ వ్యవసాయాత్మికా బుద్ధిః ఏకా (ఏవ) - ఇక్కడ నిశ్చయము తో కూడిన బుద్ధి ఒకటియే
అవ్యవసాయినామ్ బుద్ధయః - నిశ్చయములేని వారి యొక్క బుద్ధులు
బహుశాఖాః అనన్తాశ్చ హి- పలువిధములు అనంతములుగా వున్నవి

||శ్లోకతాత్పర్యములు||

"ఓ అర్జునా, ఇక్కడ( కర్మయోగము యొక్క అనుష్ఠానములో) నిశ్చయము తో కూడిన బుద్ధి ఒకటియే కావలసినది. నిశ్చయములేని వారి యొక్క బుద్ధులు, పలువిధములు అనంతములుగా వున్నవి"||41||

ఈ కర్మయోగానుష్ఠానమునకు అంటే అనుసరించడానికి కావలసినది నిశ్చయముతో కూడిన బుద్ధి ఒక్కటే.

||శ్లోకము 42-44||

యామిమాం పుష్పితాం వాచమ్ ప్రవదన్త్య విపశ్చితః|
వేదవాదరతాః పార్థ నాన్యదస్తీతి వాదినః ||42||
కామాత్మానః స్వర్గపరాః జన్మకర్మ ఫలప్రదామ్ |
కియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి ||43||
భోగైశ్వర్య ప్రసక్తానాం తయాఽపహృతచేతసామ్ |
వ్యవసాయాత్మికా బుద్ధిః సమధౌ న విధీయతే ||44||

స|| హే పార్థ ! ( సర్వేషాం) వ్యవసాయిత్మికా బుద్ధిః ( ఏకాగ్రబుద్ధిః) సమాధౌ నవిధీయతే | వేద వాద రతాః, న అన్యద్ అస్తి ఇతి వాదినః , కామాత్మానః , స్వర్గ పరాః , అవిపశ్చితః ( అవివేకః) జన్మకర్మ ప్రదాం భోగైశ్వర్య గతిం ప్రతి క్రియా విశేష బహుళాం పుష్పితాం యామ్ ఇమామ్ వాచం ప్రవదన్తి తయా అపహృత చేతసాం భోగైశ్వర్య ప్రసక్తానామ్ (ఇమే) వ్యవసాయిత్మికా బుద్ధిః సమాధౌ నవిధీయతే ||41-44||

||శ్లోకార్థములు||

హే పార్థ ! ( సర్వేషాం) వ్యవసాయిత్మికా బుద్ధిః - ఓ పార్థ అందరిలో ఏకాగ్రబుద్ధి
సమాధౌ నవిధీయతే - దైవధ్యానమందు కలుగనేరదు.
వేద వాద రతాః, - వేదకర్మలయందే ప్రీతి కలవారు
న అన్యద్ అస్తి ఇతి వాదినః - (వేదకర్మల కన్న) ఇంకొకటి లేదు అని వాదించువారు
కామాత్మానః , స్వర్గ పరాః - కోరికలతో మనస్సుకలవారు స్వర్గముపై కోరిక గలవారు
అవిపశ్చితః ( అవివేకః) - అవివేకులు
జన్మకర్మ ప్రదాం - జన్మమును కర్మమును దాని ఫలములు ఇచ్చునట్టియు
భోగైశ్వర్య గతిం ప్రతి - భోగములను ఐశ్వర్యములను సంపాదించుటకు
క్రియా విశేష బహుళాం - వివిధకర్మకలాపములతో కూడినట్టి
పుష్పితాం యామ్ ఇమామ్ వాచం - ఫలప్రదముకాని మంచి మాటలతో
ప్రవదన్తి- చెప్పుచున్నారో
తయా అపహృత చేతసాం - ఆ మాటలచే అపహరింపబడిన మనస్సుకలవారు
భోగైశ్వర్య ప్రసక్తానామ్ - భోగ ఐశ్వర్యములలో ఆసక్తి కలవారికి
( ఏకాగ్రబుద్ధి దైవధ్యానమందు కలుగదు)

||శ్లోకతాత్పర్యములు||

" ఓ పార్థ అందరిలో ఏకాగ్రబుద్ధి దైవధ్యానమందు కలుగనేరదు.
వేదకర్మలయందే ప్రీతి కలవారికి, వేదకర్మల కన్న ఇంకొకటి లేదు అని వాదించువారికి,
కోరికలతో మనస్సుకలవారికి, స్వర్గముపై కోరిక గలవారికి, అవివేకులుకు;
జన్మమును కర్మమును దాని ఫలములు ఇచ్చునట్టియు,
భోగములను ఐశ్వర్యములను సంపాదించుటకు
వివిధకర్మకలాపములతో కూడినట్టి ఫలప్రదముకాని మంచి మాటలు చెప్పుచున్నారో,
ఆ మాటలచే అపహరింపబడిన మనస్సుకలవారికి, భోగ ఐశ్వర్యములలో ఆసక్తి కలవారికి;
ఏకాగ్రబుద్ధి దైవధ్యానమందు కలుగదు".

కావలసినది వ్యవసాయాత్మికా బుద్ధి అయినా , అందరికీ ఆ బుద్ధి ఉండకపోవచ్చు అంటూ ఉదాహరణలు చెపుతాడు కృష్ణభగవానుడు.

"వేదవాదరతాః పార్థ" ! - అంటే "ఓ పార్థా !వేదము లోని కర్మకాండే తప్ప ఇంకో మార్గము లేదు అనేవారికి కర్మయోగము అనుసరించడానికి కావలసిన "నిశ్చిత" బుద్ధి ఉండదు" అని. నిశ్చిత బుద్ధి లేనివారి మనస్సు అనేక మార్గాలలో పోతుంది.

ఫలప్రదముకాని, వినుటకు ఇంపైన మాటలు చెప్ప గల అవివేకులు,వేదములలో ఫలప్రదకర్మలే ముఖ్యము ఇంకోకటి లేదు అనే వారు, అట్టివారికి కూడా యోగమునకు కావలసిన నిశ్చితమైన బుద్ధి వుండదు

కోరికలతో నిండిన మనస్సు కలవాళ్ళు, స్వర్గమే అత్యుత్తమము అన్న అభిప్రాయము కలవాళ్ళు, భోగైశ్వర్యాల కోసము అనేక కర్మలను చేసేవారు, అట్టివారికి యోగమునకు కావలసిన నిశ్చితమైన బుద్ధి వుండదు.

కొందరు భోగ ఐశ్వర్యముల ప్రాప్తికోసము అనేక మార్గములు చెపుతారు. వారు చెప్పే కర్మలు పునర్జన్మలకు కారణము.
అలాగ భోగ ఐశ్వర్యములచేత ఆకర్షింపబడినవారు, వారి కోరికలతో, తమ బుద్ధి అపహరించ బడిన వారు అవుతారు.
అలా బుద్ధి అపహరింపబడినవారికి కూడా యోగమునకు కావలసిన నిశ్చితమైన బుద్ధి వుండదు. (2.44)

ఇక్కడ వేదవాదరతాః అంటూ వేదములో కర్మ ముఖ్యమనే మాటని విశదీకరిస్తూ, కృష్ణ భగవానుడు వేదములలోని ఫలప్రదమైన కర్మలని ఖండిస్తాడు.

వేదముల గురించి తలచి నప్పుడు, వేదము ఒక మహాసాగరము లాంటిది అని గ్రహించాలి.

వేదాలలో సంహిత, బ్రాహ్మణ, అరణ్యక, ఉపనిషద్ అనే భాగములున్నాయి. ఫలప్రదమైన మాటలు కర్మలు సంహిత బ్రాహ్మణాలలో వింటాము. అరణ్యకాలు అరణ్యములలో వున్న వానప్రస్థ ఆశ్రమబద్ధులు చేయవలసిన రీతులను విశదీకరిస్తాయి. ఉపనిషత్తులు వేదాలలో సారము ఆధ్యాత్మిక చింతన కి కావలసిన విధముగా విశదీకరిస్తాయి. ఇక్కడే ఆత్మ , బ్రహ్మము మోక్షము అన్నమాటలకి అర్థము ఇక్కడే చెప్పబడుతుంది.

పైన చెప్పిన మూడు శ్లోకాలలో, వేదాలలోని మొదటి భాగములలోని ఫలప్రదమైన కర్మలను, కృష్ణుడు పూర్తిగా నిరాకరిస్తాడు.

ఇది కొత్తమాట అనిపించవచ్చు. వేదాలలో అంతములో అంటే ఉపనిషత్తులలో కూడా ఇలాంటి మాటలు వింటాము. బృహదారణ్యక ఉపనిషత్తులో బ్రహ్మజ్ఞానము పొందినవాడికి, "వేదో అవేదో భవతి" - వాళ్ళకి వేదము అవసరము లేదు అని. ఆత్మజ్ఞానము పొందినవానికి వేదముల ప్రమేయమే లేదు అని కూడా చెప్పబడుతుంది.

శంకరభగవానులు గీత ఉపనిషత్తుల సారము అంటారు. కృష్ణుడు ఇక్కడ చెప్పినమాటలు ఉపనిషత్తులను అనుసరించే మాటలే.

||శ్లోకము 45||

త్రైగుణ్య విష యావేదాః నిస్త్రైగుణ్యో భవార్జున |
నిర్ద్వన్ద్వో నిత్య సత్త్వోస్థో నిర్యోగ క్షేమ ఆత్మవాన్ ||45||

స|| హే అర్జునా ! వేదాః త్రైగుణ్య విషయాః | త్వం నిస్త్రైగుణ్యః భవ | నిర్దన్ద్వః భవ| నిత్య సత్వస్థః భవ| నిర్యోగక్షేమః భవ | ఆత్మ వాన్ భవ |

||శ్లోకార్థములు||

హే అర్జునా ! వేదాః త్రైగుణ్య విషయాః -
ఓ అర్జునా వేదములు త్రిగుణాత్మకమైన విషయములను తెలుపునవి.
త్వం నిస్త్రైగుణ్యః భవ - నీవు ఈ త్రిగుణములు విడిచినవాడవు కమ్ము.
నిర్ద్వన్ద్వః భవ- ద్వంద్వములకు అతీతుడవు కమ్ము.
నిత్య సత్వస్థః భవ- నిరంతరము శుద్ధసత్త్వమును ఆశ్రయించినవాడవు కమ్ము
నిర్యోగక్షేమః భవ - యోగక్షేమములు ఆశ్రయించని వాడవు కమ్ము.
ఆత్మ వాన్ భవ - ఆత్మ జ్ఞానివి కమ్ము.

||శ్లోకతాత్పర్యములు||

"ఓ అర్జునా వేదములు త్రిగుణాత్మకమైన విషయములను తెలుపునవి. నీవు త్రిగుణములు విడిచినవాడవు కమ్ము.
ద్వంద్వములకు అతీతుడవు కమ్ము. నిరంతరము శుద్ధ సత్త్వమును ఆశ్రయించినవాడవు కమ్ము.
యోగక్షేమములు ఆశ్రయించని వాడవు కమ్ము. ఆత్మ జ్ఞానివి కమ్ము".

వేదముల పూర్వ భాగము త్రిగుణాత్మకమైన విషయముల గురించి. కృష్ణుడు అర్జునునికి అదే మాట చెపుతాడు.
ఇంకా అర్జునుడికి. " ఓ అర్జునా నీవు త్రిగుణములను వదలిన వాడవు కమ్ము".
అంతే కాదు."నిర్ద్వన్ద్వో"- ద్వంద్వములు లేక, "నిత్య సత్త్వస్థః - ఎల్లప్పుడు సత్త్వ స్థితిలో వుంటూ , "నిర్యోగక్షేమ"- యోగక్షేమముల మీద దృష్టిలేకుండా ,"ఆత్మవాన్"- అత్మ యందే నిలిచిన వాడవు అగుము.

యోగ క్షేమముల మీద దృష్టి వుంటే ఆధ్యాత్మిక చింతన కుదరదు.
"నిర్ద్వన్ద్వో", "నిత్య సత్త్వస్థః", ద్వంద్వములకి అతీతుడుగా ఎల్లాప్పుడు సత్త్వ స్థితిలో వుండే వాడికి, వేదముల విషయాలు అక్కరలేదు. ఇదే మాట ఇంకోవిధముగా మళ్ళీ చెపుతాడు కృష్ణుడు.

||శ్లోకము 46||

యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే |
తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః ||46||

స|| ఉదపానే యావానర్థః సర్వత సంప్లుతోదకే తావాన్ ( అర్థః) యథా భవతి, ( తథైవ) సర్వవేదేషు యావానర్థః తావాన్ అర్థః విజానతః బ్రాహ్మణస్య భవతి ||46||

||శ్లోకార్థములు||

ఉదపానే యావానర్థః - బావియందు ఎంత ప్రయోజనముందో
సర్వత సంప్లుతోదకే - అంతటయును నీటితో నిండిన జలప్రవాహమునందు-
తావాన్ ( అర్థః) యథా భవతి- అంతటి ప్రయోజనము ఎట్లు కలుగుచున్నదో,( అట్లే)
సర్వవేదేషు యావానర్థః - సమస్త వేదములలో ఎంత ప్రయోజనము వుందో
తావాన్ అర్థః విజానతః బ్రాహ్మణస్య - అంత ప్రయోజనము బ్రహ్మస్వరూపము తెలిసినవానికి కలుగును

||శ్లోకతాత్పర్యము||

"బావియందు ఎంత ప్రయోజనముందో అంతటయును నీటితో నిండిన జలప్రవాహమునందు అంతటి ప్రయోజనము ఎట్లు కలుగుచున్నదో, అట్లే సమస్త వేదములలో ఎంత ప్రయోజనము వుందో, అంత ప్రయోజనము బ్రహ్మస్వరూపము తెలిసినవానికి కలుగును."||46||

ఈ శ్లోకాని తాత్పర్యము చిన్నమాటలలో ఇలా చెప్పవచ్చు: సర్వత్ర జలములు నిండి వున్నప్పుడు, నీళ్ళబావితో ఎంత ప్రయోజనమో, అదేవిధముగా బ్రహ్మజ్ఞానము పొందిన బ్రాహ్మణునికి వేదములతో అంతే ప్రయోజనము.

ఈ శ్లోకము అనేక రకములుగా చిత్రీకరణ చేయబడినది. కాని తాత్పర్యము ఇదే అనుకోవచ్చు.

ఈ శ్లోకము మీద చెప్పబడిన వ్యాఖ్యలు వినతగినవి. రామానుజాచార్యులవారు ఈ విధముగా చెప్పిరి. దప్పికగొనినవానికి మహాతటాకమునందలి జలమంటటితో ప్రయోజనము లేదు. కావలసినది నాలుగు దోసెళ్ళూ నీరు మాత్రమే. రోగి అన్ని ఔషఢములు సేవించనక్కరలేదు. ఏ ఒక్క ఔషధమైనను చక్కగా సేవించినచో చాలును అని. అంటే వేదాలలో అనేక మంత్రాలు ఉన్నాయి. ముముక్షునకు ఏ ఒక్క మంత్రమో ఉపాసనయో సక్రమముగా అనుష్ఠించిన చాలు అని. "అన్నింటిని మేము చేయలేదే" అని ఎవరు దిగులు పడనవసరము లేదు అని భగవంతుని ఆశ్వాసము ఇక్కడ.

||శ్లోకము 47||

కర్మణ్యేవాధికారస్తే మాఫలేషు కదాచన |
మాకర్మఫల హేతుర్భూః మాతే సఙ్గోఽస్త్వకర్మణి || 47||

స|| తే కర్మణ్యేన అధికారః | కదాచన ఫలేషు అధికారః మా | కర్మ ఫలహేతుః మాభూః | అకర్మణి తే సఙ్గః మా అస్తు ||47||

||శ్లోకార్థములు||

తే కర్మణ్యేన అధికారః - నీకు కర్మమునందే అధికారము కలదు
కదాచన ఫలేషు అధికారః మా - ఎప్పుడును ఫలములందు వలదు
కర్మ ఫలహేతుః మాభూః - కర్మ ఫలములకు కారణమైనవాడివి కాకుము.
అకర్మణి తే సఙ్గః మా అస్తు - కర్మలు చేయకుండుట యందు ఆసక్తి కలుగకుండుగాక.

||శ్లోకతాత్పర్యము||

"నీకు కర్మమునందే అధికారము కలదు. ఎప్పుడును ఫలములందు వలదు.
కర్మ ఫలములకు కారణమైనవాడివి కాకుము. కర్మలు చేయకుండుట యందు ఆసక్తి కలుగకుండుగాక."|| 47||

ఇక్కడ కృష్ణుడు చెప్పినమాట. "నీకు కర్మ చేయుట యందే అధికారము కలదు. కర్మఫలము లందు ఆసక్తి ఉండకూడదు". ఇది చాలా ముఖ్యమైన మాట.

అయితే కర్మఫలములమీదా ఆసక్తి ఉండకోడదు, అంటే మరి కష్టపడి కర్మ చేయడమెందుకూ అని, కర్మలే మానుకో కూడదు.

కర్మఫలముమీద కోరికతో కర్మ చేయకూడదు. అయితే కర్మ ఎలాచెయ్యాలి అన్న ప్రశ్న వస్తుంది. దానికి సమాధానముగ కృష్ణుడు ఇంకా ఇలా చెపుతాడు.

||శ్లోకము 48||

యోగస్తః కురు కర్మాణి సఙ్గం త్యక్త్వా ధనంజయ |
సిధ్య సిధ్యోః సమోభూత్వా సమత్వం యోగ ఉచ్యతే ||48||

స|| హే ధనంజయ ! (త్వం) యోగస్థః సఙ్గం త్యక్త్వా సిధ్యసిధ్యోః సమో భూత్వా కర్మాణి కురు | సమత్వం యోగమ్ (ఇతి) ఉచ్యతే ||48||

||శ్లోకార్థములు||

సఙ్గం త్యక్త్వా - ఆసక్తిని విడిచి
సిధ్యసిధ్యోః సమో భూత్వా - ఫలము పొందినను పోందకపోయినను సమముగా వున్నవాడవై
యోగస్థః కర్మాణి కురు - యోగనిష్ఠలో వుండి కర్మలు చేయుము.
సమత్వం యోగమ్ (ఇతి) ఉచ్యతే- సమబుద్ధియే యోగమని చెప్పబడుచున్నది.

||శ్లోకతాత్పర్యము||

"ఓ పార్థా, ఆసక్తిని విడిచి ఫలము పొందినను పోందకపోయినను సమముగా వున్నవాడవై
యోగనిష్ఠలో వుండి కర్మలు చేయుము. సమబుద్ధియే యోగమని చెప్పబడుచున్నది."

ముఖ్యమైన మాటలు.
"సంగం త్యక్త్వా"- కర్మఫలముల పై ఆసక్తిలేకుండా
"సిద్ధ్య అసిద్ధ్యో సమోభూత్వా"- ఫలము సిద్ధించినా సిద్ధించకపోయినా సమముగా భావించి,
యోగస్థః - యోగావస్థలో ఉండి( కర్మచెయ్యి)
"కురు కర్మాణి"- కర్మ చెయ్యి !

అంటే కృష్ణుడు అర్జునిడికి ఇలాబోధిస్తాడు. "సమత్వ బుద్ధితో కూడి నీవు నిష్కామ కర్మను చేయుము"అని

||శ్లోకము 49||

దూరేణాహ్యవరం కర్మ బుద్ధియోగాత్ ధనంజయ |
బుద్ధౌ శరణ మన్విఛ్ఛ కృపణాః ఫలహేతవః ||49||

స|| హే ధనంజయ ! బుద్ధియోగాత్ కర్మ దూరేణ అవరం హి ( హీనం భవతి) ! (తదేవ సమత్వ) బుద్ధౌ శరణం అన్విచ్ఛ | ఫలహేతవః కృపణాః ( దీనాః) ||49||

||శ్లోకార్థములు||

బుద్ధియోగాత్ కర్మ - బుద్ధియోగము కన్న కామ్య కర్మ
దూరేణ అవరం హి - మిక్కిలి తక్కువ కదా
(తదేవ) బుద్ధౌ శరణం అన్విచ్ఛ - ( అందువలన) ఆ సమత్వ బుద్ధి యందు శరణుకోరుము.
ఫలహేతవః కృపణాః - ఫలములు కోరువారు అల్పులు

||శ్లోకతాత్పర్యము||

"ఓ ధనంజయా, బుద్ధియోగము కన్న కామ్య కర్మ మిక్కిలి తక్కువ కదా.
( అందువలన) ఆ సమత్వ బుద్ధి యందు శరణుకోరుము. ఫలములు కోరువారు అల్పులు".||49||

ఇంకోమాట చెపుతాడు. ఫలాపేక్షతో చేసిన కర్మకన్నా, ఫలాపేక్షలేకుండా చేసే కర్మ మహత్తరమైనది. అందుకని ఫలాపేక్షలేకుండా కర్మచేయగల బుద్ధిని ఆశ్రయింపుము అని. అంటే సమత్వ బుద్ధి ని శరణు కోరుము అని.

||శ్లోకము 50||

బుద్ధియుక్తో జహాతిహ ఉభే సుకృత దుష్కృతే |
తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలమ్||50||

స|| బుద్ధియుక్తః ఉభే సుకృత దుష్కృతే ఇహ ( లోకే) జహాతి ( త్యజతి) |తస్మాత్ యోగాయ యుజ్యస్వ | కర్మసు కౌశలం యోగః ఇతి ఉచ్యతే ||50||

||శ్లోకార్థములు||

బుద్ధియుక్తః- సమత్వ బుద్ధితో కూడినవాడు
ఉభే సుకృత దుష్కృతే - పాపపుణ్యములను రెండింటినీ
ఇహ ( లోకే) జహాతి - ఈ లోకములోనే విడుచుచున్నాడు.
తస్మాత్ యోగాయ యుజ్యస్వ - అందువలన సమత్వ బుద్ధికై సిద్ధపడుము
కర్మసు కౌశలం యోగః ఇతి ఉచ్యతే - కర్మలయందు నేర్పు యోగమనిచెప్పబడుచున్నది.

||శ్లోకతాత్పర్యము||

"సమత్వ బుద్ధితో కూడినవాడు పాపపుణ్యములను రెండింటినీ ఈ లోకములోనే విడుచుచున్నాడు.
అందువలన సమత్వ బుద్ధికై సిద్ధపడుము. కర్మ లయందు నేర్పు యోగమనిచెప్పబడుచున్నది".||50||

సమత్వ బుద్ధిని ఎందుకు ఆశ్రయించమంటున్నాడో ఇక్కడ విదితమౌతుంది. సమబుద్ధితో కూడినవాడు పాపపుణ్యములను ఈ లోకములో నే విడుచుచున్నాడు. అంటే మోక్షము పొందుతాడు అని.

||శ్లోకము 51||

కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః |
జన్మ బన్ధ వినిర్ముక్తాః పదం గచ్చన్త్యనామయమ్||51||

స|| బుద్ధి యుక్తాః మనీషిణః కర్మజమ్ ఫలం త్యక్త్వా జన్మ బంధవినిర్ముక్తాః ( భవన్తి) | అనామయం పదం గచ్చన్తి హి (చ) ||

||శ్లోకార్థములు||

బుద్ధి యుక్తాః మనీషిణః - సమత్వబుద్ధితో కూడిన మనుష్యులు
కర్మజమ్ ఫలం త్యక్త్వా - కర్మలవలన కలిగిన ఫలములను విడిచి
జన్మ బంధవినిర్ముక్తాః - జన్మ బంధములనుంచి విముక్తుడగుచున్నాడు.
అనామయం పదం గచ్చన్తీ హి - దుఖరహితమగు స్థానమును పొందుచున్నారు.

||శ్లోకతాత్పర్యము||

"సమత్వబుద్ధితో కూడిన మనుష్యులు కర్మలవలన కలిగిన ఫలములను విడిచి,
జన్మ బంధములనుంచి విముక్తుడగుచున్నాడు. దుఖరహితమగు స్థానమును పొందుచున్నాడు".||51||

సమత్వ బుద్ధితో కూడినవారు కర్మఫలములను విడిచి అంటే నిష్కామ కర్మద్వారా జన్మ బంధములనుంచి విముక్తుడు అగుతున్నాడు అని. నిష్కామ కర్మ ద్వారా చిత్తము శుద్ధముకాగా , ఆ నిర్మల చిత్తములో ఆత్మ జ్ఞానము ఉదయించుటచే వారు జన్మ బంధ రహితులు అగుచున్నారు. ఈ శ్లోకములో సమత్వబుద్ధి కూడా చెప్పడమైనది. సమత్వ బుద్దికలవాడు నిర్మల చిత్తుడు. సమత్వము కలవాడు పాప పుణ్యములను ఈ లోకములో నే విడుచును అని ముందు శ్లోకములో చెప్పబడినది. అది కూడా మోక్షమే. మోక్షమునకు అనేక మార్గములు వున్నాయి.

||శ్లోకము 52||

యదాతే మోహకలిలం బుద్ధిర్వ్యతిరిష్యతి |
తదా గన్తాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ||52||

స|| యదా తే బుద్ధిః మోహకలిలం వ్యతిరిష్యతి తదా శ్రోతవ్యస్య చ శ్రుతస్య చ నిర్వేదం గన్తాసి ( ఆప్నోసి) || 52||

||శ్లోకార్థములు||
యదా తే బుద్ధిః - ఎప్పుడు నీ బుద్ధి
మోహకలిలం వ్యతిరిష్యతి - అజ్ఞానమును దాటకలదో
తదా శ్రోతవ్యస్య చ శ్రుతస్య చ - అప్పుడు వినతగినదానియందు వినినదానియందు
నిర్వేదం గన్తాసి - విరక్తిని పొందుచున్నాడు

||శ్లోకతాత్పర్యము||

"ఎప్పుడు నీ బుద్ధి అజ్ఞానమును దాటకలదో
అప్పుడు వినతగిన దాని యందు వినిన దానియందు
విరక్తిని పొందుచున్నావు"||52||

జ్ఞానోదయము అయినతరువాత, వినతగినది వినతగనిది అన్నమాటలేదు. అది భావము. ఇది కూడా 'వేదో అవేదో భవతి", అన్నమాటతో సమానము. ఆత్మజ్ఞానము పోందినవానికి వినతగిన వినిన మాటలతో సంబంధములేదు అన్నమాట.
'
||శ్లోకము 53||

శ్రుతి విప్రతి పన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా |
సమాధా వచలా బుద్ధిః తదా యోగ మవాప్స్యసి||53||

స|| శృతి విప్రతి పన్నా తే బుద్ధిః యదా నిశ్చలా ( భవతి) సమాధౌ అచలా స్థాస్యతి ( భవతి) తదా (త్వం)యోగమ్ అవాప్స్యసి ||53||

||శ్లోకార్థములు||

శృతి విప్రతి పన్నా -అనేకశ్రవణములచే కలత చెందిన
తే బుద్ధిః యదా నిశ్చలా - నీ యొక్క బుద్ధి ఎప్పుడు చలింపనిదై
సమాధౌ అచలా స్థాస్యతి - సమాధిలో అచలముగా వుండునో
తదా (త్వం)యోగమ్ అవాప్స్యసి - అప్పుడు నీవు యోగమును పొందగలవు.

||శ్లోకతాత్పర్యము||

"అనేకశ్రవణములచే కలత చెందిన నీ యొక్క బుద్ధి ఎప్పుడు చలింపనిదై సమాధిలో అచలముగా వుండునో
అప్పుడు నీవు యోగమును పొందగలవు"||53||

అంటే ఇప్పటిదాకా చెప్పినది ఒకసారి సమీకరణము చేద్దాము. త్రిగుణములను దాటి, ద్వంద్వములకి అతీతుడై, అంటే సుఖదుఃఖాలు శీతోష్ణములకు, సిద్ధి అసిద్ధులకు అతీతుడై, యోగక్షేమాలకి అతీతుడై, ఆత్మలోనే సంతుష్టి పొందుతూ, అన్నిటిలోనూ సమత్వము పొందితే, ఆ సమత్వము యోగమనబడును.

ఆ సమత్వము పొంది, ఆ సమత్వములో శరణు పొందితే, అంటే ఆ సమత్వబుద్ధినే ఆశ్రయిస్తే, పాపపుణ్యములను ఇక్కడే వదిలేసి, ఈ జన్మములోనే యోగము పొందగలవు.

అపుడు అర్జునునికి అట్టి యోగము పొందినవాడు అంటే ఆ యోగ సమాధిలో నున్నవాని లక్షణములు ఏమి అని సందేహము వస్తుంది. అదే ప్రశ్నరూపములో వస్తుంది ఇక్కడ.

||శ్లోకము 54||

అర్జున ఉవాచ:

స్థిత ప్రజ్ఞస్య కా భాషా సమాధిస్తస్య కేశవ |
స్థితధీః కీమ్ ప్రభాషేత కిమాసీత వ్రజేత కిమ్||54||

స||హే కేశవా| సమాధిస్థస్య స్థిత ప్రజ్ఞస్యబాషా కా ? స్థిత ధీః కిం ప్రభాషేత ? కిమ్ ఆసీత ? కిమ్ వ్రజేత? 54||

||శ్లోకార్థములు||

హే కేశవా| సమాధిస్థస్య - ఓ కేశవా సమాధియందు వున్న
స్థిత ప్రజ్ఞస్య బాషా కా - స్థిత ప్రజ్ఞుని లక్షణములు ఎవి?
స్థిత ధీః కిం ప్రభాషేత - స్థిరబుద్ధి కలవాడు ఏమి పలుకును?
కిమ్ ఆసీత ? కిమ్ వ్రజేత? - ఎట్లు వుండును? ఎట్లు సంచరించును?

||శ్లోకతాత్పర్యము||

అర్జునుడు పలికెను:
"ఓ కేశవా సమాధియందు వున్న స్థిత ప్రజ్ఞుని లక్షణములు ఎవి?
స్థిరబుద్ధి కలవాడు ఏమి పలుకును? ఎట్లు వుండును? ఎట్లు సంచరించును?" ||54||

అర్జునిడి ప్రశ్న, సమాధియందుండు స్థితప్రజ్ఞు డగు జీవన్ముక్తుని యొక్క లక్షణములు ఏమిటి?
ఎలా మాట్లాడతాడు ? ఏ రీతిగా వుంటాడు ? ఎలాకూర్చుంటాడు ? అని.

ఇక్కడ శ్రీకృష్ణుడు స్థిత ప్రజ్ఞుని లక్షణములను పద్దెనిమిది శ్లోకాలలో వివరిస్తాడు.

చాలామందికి ఈ శ్లోకాలమీద చాలా భక్తి , ధ్యాస. వినోబా భావే తన గీతోపన్యాసాలలో ఈ పద్దెనిమిది శ్లోకాలలో పద్దెనిమిది అధ్యాయాల సారము వున్నది అంటారు. అందుకని ఆ కాలపు సత్యాగ్రహులు అందరూ, ప్రతిరోజూ ఈ పద్యాల పఠించేవారుట. అదేమాట స్వామీ రంగనాధానందకూడా తమ భగవద్గీత వ్యాఖ్యానములో ప్రస్తావిస్తారు. ఈ శ్లోకాలు గాంధీ గారి ఆశ్రమములో ప్రతిదినము పఠించేవారని. సత్యాగ్రహులందరూ స్థితప్రజ్ఞుని లాగ నిష్ఠలో వుండాలి అని ఉద్దేశ్యము అన్నమాట.

స్థిత ప్రజ్ఞుని లక్షణములలాగా, జీవన్ముక్తుని గురించి ఐదవ అధ్యాయములో, భక్తుని గురించి పన్నెండవ అధ్యాయములో, గుణాతీతుని గురించి పద్నాలుగొవ అధ్యాయములో కృష్ణుని ద్వారా వింటాము.

ఇక స్థితప్రజ్ఞుని లక్షణములు.

||శ్లోకము 55||

శ్రీ భగవానువాచ :
వ్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ |
ఆత్న్మన్యేవాత్మనా తుష్టః స్థిత ప్రజ్ఞః తదోచ్యతే ||55||

స|| హే పార్థ ! యదా మనోగతాన్ సర్వాన్ కామాన్ వ్రజహాతి ఆత్మన్యేవ ఆత్మనా తుష్ఠః ( సంతుష్ఠః) భవతి (తం) స్థిత ప్రజ్ఞ ఇతి ఉచ్యతే ||55||

||శ్లోకార్థములు||

యదా మనోగతాన్ - ఎప్పుడు మనస్సు నందు ఉండెడి
సర్వాన్ కామాన్ వ్రజహాతి - సమస్త కోరికలను విడుచుచున్నాడో
ఆత్మన్యేవ ఆత్మనా తుష్ఠః - ఆత్మయందు ఆత్మచే సంతుష్ఠి పొందినవాడై
(తం) స్థిత ప్రజ్ఞ ఇతి ఉచ్యతే - అట్టివానిని స్థితప్రజ్ఞుడు అనబడుచున్నాడు

||శ్లోకతాత్పర్యము||

"ఎప్పుడు మనస్సు నందు ఉండెడి సమస్త కోరికలను విడుచుచున్నాడో
ఆత్మయందు ఆత్మచే సంతుష్ఠి పొందినవాడై వుండునో,
అట్టివానిని స్థితప్రజ్ఞుడు అనబడుచున్నాడు"||55||

ఇక్కడ, "ఆత్మన్యే వాత్మనా తుష్టః", అంటే ఆత్మయందే తృప్తి చెందినవాడు అని.
అట్టివాడికి సుఖదుఃఖాలతో పనిలేదు. భోగైశ్వర్యాలతో పని లేదు. పరివారాలతో అసలు పనిలేదు. తన స్థాయిలో లేకపోయినా అందరినీ తనతోనే సమానము గా చూడగలిగినవాడు. తృప్తిచెందినవాడు. అంటే సచ్చిదానంద స్వరూపుడు.
అత్మానుభవము ఇచ్చే ఆనందమే ఆ ఆనందము.
అట్టివాడిని స్థితప్రజ్ఞుడు అంటారు.

అలాగ కోరికలు వదిలేసినవాడి గురించి ఇంకా చెపుతాడు కృష్ణుడు.

||శ్లోకము 56||

దుఃఖేష్వనుదిగ్న మనాః సుఖేషు విగత స్పృహః |
వీతరాగ భయక్రోథః స్థితధీః మునిరుచ్యతే ||56||

స|| (యః) దుఃఖేషు అనుద్విగ్న మనాః (యః) సుఖేషు విగత స్పృహః (యః) వీతరాగ భయక్రోధః (సః) మునిః స్థితధీః ఇతి ఉచ్యతే ||56||

||శ్లోకార్థములు||

దుఃఖేషు అనుద్విగ్న మనాః - దుఃఖములలోకలత చెందని మనస్సు కలవాడు
సుఖేషు విగత స్పృహః - సుఖములలో ఆసక్తిలేనివాడు
వీతరాగ భయక్రోధః - అనురాగము, భయము, కోపము తొలగినవాడు
మునిః స్థితధీః ఇతి ఉచ్యతే - అట్టి ముని స్థిత ప్రజ్ఞుడని చెప్పబడుచున్నాడు.

||శ్లోకతాత్పర్యము||

"దుఃఖములలోకలత చెందని మనస్సు కలవాడు, సుఖములలో ఆసక్తిలేనివాడు,
అనురాగము, భయము, కోపము తొలగినవాడు, అట్టి వాడు స్థిత ప్రజ్ఞుడని చెప్పబడుచున్నాడు".||56||

||శ్లోకము 57||

యస్సర్వత్రానభిస్నేహః తత్తత్ప్రాప్య శుభాశుభం |
నాభి నన్దతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్టితా||57||

స|| యః సర్వత్ర అనభిస్నేహః తత్ తత్ శుభాశుభం ప్రాప్య న అభినన్దతి న ద్వేష్ఠి ( భవతి) తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ||57||

||శ్లోకార్థములు||

యః సర్వత్ర అనభిస్నేహః - ఎవరు సమస్త విషయములలో అభిమానము లేనివాడై
తత్ తత్ శుభాశుభం ప్రాప్య - ఆయా శుభ అశుభములను పొంది
న అభినన్దతి న ద్వేష్ఠి- సంతోషింపడో , ద్వేషమును పొందడో
తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా - అట్టి వాని జ్ఞానము స్థిరమైనది.

||శ్లోకతాత్పర్యము||

"ఎవరు సమస్త విషయములలో అభిమానము లేనివాడై, ఆ యా శుభ అశుభములను పొంది కూడా
సంతోషింపడో , ద్వేషమును పొందడో, అట్టి వాని జ్ఞానము స్థిరమైనది".||57||

అంటే ఎవరైతే, 'సర్వత్రానభిస్నేహ", అన్నిట్లోనూ అభిమానము లేనివాడై, శుభాశుభములను పొందిననూ
'నాభినన్దతి నద్వేష్ఠ" - అనందముపొందడు ద్వేషమునూ పొందడు.' అట్టివాడి ప్రజ్ఞ స్థిరమైనది.

ఈ శ్లోకాలలో భగవానుడు చెప్పినది; "(ఎవరైతే) మనస్సునందలి నందలి కొరికలను సంపూర్ణముగా వదలి, నిరంతరము ఆత్మయందే సంతుష్టిని పొందు చుండునో, దుఃఖమునందు కలత సుఖమునందు ఆసక్తి లేనివాడై, కోరికలు లేని వాడై, ప్రియము కలిగినప్పుడు ఆనందము, అప్రియము కలిగి నప్పుడు ద్వేషము లేనివాడు, స్థిత ప్రజ్ఞుడు" అని.

ఆ స్థిత ప్రజ్ఞుని ప్రతిభ ఏమిటి ?
||శ్లోకము 58||

యదా సంహారయతే చాయమ్ కూర్మోఽఙ్గానీవ సర్వశః | ??
ఇన్ద్రియాణీన్ద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్టితా||58||

స|| యథా కూర్మః అంగాని సంహరయతి తథైవ యదా అయం (యోగీ) ఇన్ద్రియార్థేభ్యః ఇన్ద్రియాణి సర్వశః సంహరతే తదా తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ||58||

||శ్లోకార్థములు||

యథా కూర్మః అంగాని సంహరయతి - ఏ విధముగా తాబేలు తన అంగములను వెనుకకు మరల్చు చున్నదో
తథైవ యదా అయం (యోగీ) - ఆ విధముగనే ఈ యోగి
ఇన్ద్రియార్థేభ్యః ఇన్ద్రియాణి సర్వశః సంహరతే -
ఇన్ద్రియవిషయములనుంచి ఇన్ద్రియములను వెనుకకు మరల్చునో.
తదా తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా - అప్పుడు అట్టివాని జ్ఞానము స్థిరమైనది.

||శ్లోకతాత్పర్యము||

"ఏ విధముగా తాబేలు అంగములను వెనుకకు మరల్చు చున్నదో, ఆ విధముగనే ఈ యోగి
ఇన్ద్రియవిషయములనుంచి ఇన్ద్రియములను వెనుకకు మరల్చునో.అప్పుడు అట్టివాని జ్ఞానము స్థిరమైనది".||58||

అట్టివాడు తాబేలు తన అవయవములను లోనికి ముడుచుకోనునట్లు, ఇంద్రియములను విషయములందు ఆశక్తి తొలగించి
ఆ ఇంద్రియములను వెనుకకు మరలుచేయగల వాడు అన్నమాట. అందుకే వానిని స్థితప్రజ్ఞుడు అందురు.

||శ్లోకము 59||

విషయా వినివర్తన్తే నిరాహారస్య దేహినః |
రసవర్జం రసోఽ ప్యస్య పరం దృష్ట్వా నివర్తతే ||59||

స|| నిరాహరస్య దేహినః రసవర్జం విషయాః | పరమ్ ( పరమాత్మన్) దృష్ట్వా రసో అపి అస్య నివర్తతే ||59||

||శ్లోకార్థములు||

నిరాహరస్య దేహినః - విషయరూపమైన ఆహారము స్వీకరింపనట్టి జీవునకు
రసవర్జం విషయాః - విషయవాసన తప్ప విషయములు
వినివర్తన్తే- తొలగుచున్నవి.
పరమ్ ( పరమాత్మన్) దృష్ట్వా - పరమాత్మను పోందిన పిమ్మట
రసో అపి అస్య నివర్తతే - విషయవాసనకూడా తొలగి పోవుచున్నది

||శ్లోకతాత్పర్యము||
"విషయరూపమైన ఆహారము స్వీకరింపనట్టి జీవునకు, విషయవాసన తప్ప విషయములు
తొలగుచున్నవి. పరమాత్మను పోందిన పిమ్మట విషయవాసనకూడా తొలగి పోవుచున్నది". ||59||

నిరాహారములో వున్న జీవునకు, 'విషయా వినివర్తన్తే", ఆహారము పై కోరికలు నివర్తించును. అయితే రుచి వాసన పోకపోవచ్చు
కాని 'పరం దృష్ట్వ', అంటే బ్రహ్మజ్ఞానము పొందినవాడికి, ఆ రుచివాసనమీద కూడా కోరికలు వుండవు అని.

||శ్లోకము 60||

యతతోహ్యపి కౌన్తేయ పురుషస్య విపశ్చితః |
ఇన్ద్రియాణి ప్రమాధీని హరన్తి ప్రసభం మనః ||60||

స|| హే కౌన్తేయ ! యతతః ( ప్రయత్నం కుర్వన్) అపి విపశ్చితః పురుషస్య మనః ప్రమాధీని ఇంద్రియాణి ప్రసభం హరంతి ||60||

||శ్లోకార్థములు||

యతతః ( ప్రయత్నం కుర్వన్) అపి - ప్రయత్నము చేయు చున్నవాడైనను
విపశ్చితః పురుషస్య మనః - శాస్త్రజ్ఞానము కల మనుష్యుని మనస్సును
ప్రమాధీని ఇంద్రియాణి - కలతచెందు ఇన్ద్రియములు
ప్రసభం హరంతి - బలాత్కారముగా లావుచున్నవి కదా||

||శ్లోకతాత్పర్యము||

"ఓ అర్జునా, ప్రయత్నము చేయు చున్నవాడైనను, శాస్త్రజ్ఞానము కల మనుష్యుని మనస్సును
కలతచెందు ఇన్ద్రియములు బలాత్కారముగా లావుచున్నవి కదా".||60||

అంటే ఈ ఇంద్రియాలు మహాశక్తికలవి. ఎందుకు- విద్వాంసుడైన పురుషుని మనస్సును బలాత్కారముగా లాగుచున్నవి.
అలాంటి ఇంద్రియాలను వశపరుచుకోగల వాడి ప్రజ్ఞ ప్రతిష్ఠమైనది.అదే కృష్ణుడు చెప్పే మాట.

||శ్లోకము 61||

తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః|
వశే హి యస్యేన్ద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్టితా ||61||

స|| తాని సర్వాణి సంయమ్య యుక్తః మత్పరః ఆసీత | హి ( యతః) యస్యఇంద్రియాణి వశే తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ||61||

||శ్లోకార్థములు||

తాని సర్వాణి సంయమ్య - ఆ ఇన్ద్రియములను అన్నిటినీ వశపరచుకొని
యుక్తః మత్పరః ఆసీత - యోగములో వున్నవాడు నాయందు మనస్సు కలవాడై ఉండవలెను
హి ( యతః) యస్యఇంద్రియాణి వశే - ఎవనియొక్క ఇన్ద్రియములు స్వాధీనమై వుండునో
తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా - అట్టివాని జ్ఞానము స్థిరమైనది

||శ్లోకతాత్పర్యము||

"ఆ ఇన్ద్రియములను అన్నిటినీ వశపరచుకొనియోగములో వున్నవాడు, నాయందు మనస్సు కలవాడై ఉండవలెను.
ఎవనియొక్క ఇన్ద్రియములు స్వాధీనమై వుండునో, అట్టివాని జ్ఞానము స్థిరమైనది." ||61||

ఇప్పుడు స్థితప్రజ్ఞుడు కాని వాడు, అంటేమనస్సు స్థిరత్వము పొందకుండా వున్నవాడిగురించి కృష్ణుడు చెపుతాడు.

||శ్లోకము 62-63||

ధ్యాయతో విషయాన్ పుంసః సఙ్గస్తేషూపజాయతే |
సఙ్గాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే ||62||
క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః |
స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణస్యతి ||63||

స|| విషయాన్ ధ్యాయతః పుంసః తేషు సంగః ఉపజాయతే | సంగాత్ కామః సంజాయతే| కామాత్ క్రోధః అభిజాయతే |క్రోధాత్ సమ్మోహః భవతి | సమ్మోహాత్ స్మృతి విభ్రమః భవతి | స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశః భవతి | బుద్ధి నాశాత్ ప్రణస్యతి ||62-63||

||శ్లోకార్థములు||

విషయాన్ ధ్యాయతః పుంసః - విషయములను చింతించుచున్న మనుజునకు
తేషు సంగః ఉపజాయతే - ఆ విషయములందు ఆసక్తి కలుగుచున్నది
సంగాత్ కామః సంజాయతే- ఆసక్తితో కోరిక కలుగుచున్నది.
కామాత్ క్రోధః అభిజాయతే - కోరికవలన కోపము పుట్టుచున్నది
క్రోధాత్ సమ్మోహః భవతి - కోపము వలన అవివేకము కలుగుచున్నది
సమ్మోహాత్ స్మృతి విభ్రమః భవతి - అవివేకము వలన మతిమఱుపు కలుగుచున్నది
స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశః భవతి - మతిమఱుపుతో బుద్ధినాశము కలుగుచున్నది.
బుద్ధి నాశాత్ ప్రణస్యతి- బుద్ధి నాశనముతో నశించిపోవుచున్నాడు.

||శ్లోకతాత్పర్యము||

"విషయములను చింతించుచున్న మనుజునకు, ఆ విషయములందు ఆసక్తి కలుగుచున్నది.ఆసక్తితో కోరిక కలుగుచున్నది. కోరికవలన కోపము పుట్టుచున్నది. కోపము వలన అవివేకము కలుగుచున్నది. అవివేకము వలన మతిమఱుపు కలుగుచున్నది. మతిమఱుపుతో బుద్ధినాశము కలుగుచున్నది. బుద్ధి నాశనముతో నశించిపోవుచున్నాడు."||62-63||

మనుష్యులలో కోరిక ఎలా జనిస్తుంది?
ముందు ఒక విషయము కళ్ళలో పడుతుంది
ఆ విషయము అప్పుడు అలోచనారూపములో మనస్సును ఆక్రమిస్తుంది.
అప్పుడు ఆ మనస్సు బాగుంది అని పించి కావాలని కోరిక పడుతుంది.
అప్పుడు దానికి అడ్డంకులు కలిగితే మనస్సు సహించదు.
ఆ తీర్చబడని కోరికనుంచి క్రోధము చెలరేగుతుంది.
అదే ఈ శ్లోకములో చెప్పబడిన మాట.

క్రోధము అంతటి తో ఆగదు - ఇంకా ముందుకు పోతుంది.

"ఆసక్తి యుండుట వలన జనించిన కొరిక, ఆసక్తి తీరకపోవడము వలన కొపము గా మారుతుంది. కోపమువలన అవివేకము. అవివేకము వలన మరపు, మరపు వలన బుద్ధి నాశము. బుద్ధినాశనము నుండి పూర్తి నాశనము కూడా క్రమముగా సంభవించు చున్నది"

ఇది త్రిగుణాత్మకమ్ అంటే మూడు గుణముల వలన జరిగే విషయము. ఇది మానవ ప్రకృతి. దీనిని అధిగమించి ముందుకు పోవాలి. అంటే, కృష్ణుడు అర్జునికి చెప్పినట్లు, "నిస్త్రైగుణ్యోభవ" అవ్వాలి.

అలా త్రిగుణములను అధిగమించినప్పుడు మనస్సుకు శాంతి లభిస్తుంది. అదే మనము వింటాము కృష్ణుడి ద్వారా.

||శ్లోకము 64||

రాగద్వేషవియుక్తైస్తు విషయానిన్ద్రియైశ్చరన్ |
అత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధి గచ్ఛతి ||64||

స|| (సః) విధేయాత్మా రాగద్వేషవియుక్తైః ఆత్మవశ్యైః ఇంద్రియైః విషయాన్ చరన్ ప్రసాదం అధిగచ్ఛతి ||64||

||శ్లోకార్థములు||

విధేయాత్మా - స్వాధీనమైన మనస్సు కలవాడు
రాగద్వేషవియుక్తైః - రాగద్వేషములు లేనివియు
ఆత్మవశ్యైః ఇంద్రియైః- తన స్వాధీనములో వున్న ఇన్ద్రియములచేత
విషయాన్ చరన్ - విషయములను అనుభవించుచున్నను
ప్రసాదం అధిగచ్ఛతి - మనో నిర్మలత్వము పొందుచున్నాడు.

||శ్లోకతాత్పర్యము||

"స్వాధీనమైన మనస్సు కలవాడు, రాగద్వేషములు లేనివియు
తన స్వాధీనములో వున్న ఇన్ద్రియములచేత విషయములను అనుభవించుచున్నను,
మనో నిర్మలత్వము పొందుచున్నాడు".|| 64||

'విధేయాత్మా', అంటే మనస్సు స్వాధీనములో వున్నవాడు. అట్టివాడు రాగద్వేషములను వదిలి , 'ఆత్మవస్యైః' - తన వశములో వున్న ఇంద్రియములతో విషయములలో తిరుగుచున్నప్పటికీ మనశ్శాంతి పొందుతున్నాడు..

మనశ్శాంతి వున్నప్పుడు అన్ని దుఃఖములు నాశనమైపోతాయి. ప్రసన్నమైన మనస్సుతో బుద్ధి స్థిరముగా వుండును.

||శ్లోకము 65||

ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే |
ప్రసన్న చేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్టతి||65||

స|| ప్రసాదే అస్య సర్వ దుఃఖానాం హానిః( వినాశః) ఉపజాయతే | (తతః) ప్రసన్న చేతసః బుద్ధిః అశు పర్యవతిష్ఠతి ( పరమాత్మన్ అధి తిష్ఠతి) || .

||శ్లోకార్థములు||

ప్రసాదే అస్య - మనోనిర్మలత్వము కలుగగా అతనికి
సర్వ దుఃఖానాం హానిః( వినాశః) ఉపజాయతే - సమస్త దుఃఖములనుండి హాని తొలగిపోవుచున్నది
ప్రసన్న చేతసః - ఆ ప్రసన్నమనస్సు కలవానికి
బుద్ధిః అశు పర్యవతిష్ఠతి - బుద్ధి శీఘ్రముగా స్థిరముగా నిలుచును

||శ్లోకతాత్పర్యము||

"మనోనిర్మలత్వము కలుగగా అతనికి
సమస్త దుఃఖములనుండి హాని తొలగిపోవుచున్నది
ఆ ప్రసన్నమనస్సు కలవానికి బుద్ధి శీఘ్రముగా స్థిరముగా నిలుచును".|| 65||

నిర్మలమైన మనస్సు వలన రెండు మహత్తర ఫలములు వుంటాయి. ఒకటి సమస్త దుఃఖములనుండి విడుదల. రెండవది స్థిరత్వము వున్న అంటే నిలకడ వున్నబుద్ధి . ఇదే యోగవాశిష్ఠములో ఇంకోవిధముగా చెప్పబడినది. యోగవాశిష్ఠములో , " మోక్షో హి చేతో విమలమ్ సమ్యగ్ జ్ఞానవిబోధితమ్" అంటే జ్ఞాన విచారణతో వచ్చిన నిర్మలచిత్తమే మోక్షము అని.

||శ్లోకము 66||

నాస్తి బుద్ధి రయుక్తస్య న చాయుక్తస్య భావనా |
నచా భావయతశ్శాన్తిః అశాన్తస్య కుతః సుఖమ్ ||66||

స|| అయుక్తస్య బుద్ధిః నాస్తి | అయుక్తస్య భావనాచ ( ఆత్మ చింతన) న ( భవతి) | అభావయతః శాంతిః చ న ( భవతి) | అశాంతస్య సుఖః కుతః ||66||

||శ్లోకార్థములు||

అయుక్తస్య బుద్ధిః నాస్తి - ఇన్ద్రియనిగ్రహము లేనివానికి వివేకబుద్ధి కలుగదు
అయుక్తస్య భావనాచ ( ఆత్మ చింతన) న - ఇన్ద్రియనిగ్రహము లేనివానికి ఆత్మ చింతన కూడా కలుగదు
అభావయతః శాంతిః చ న - ఆత్మచింతన లేనివానికి శాంతి కూడా కలుగదు
అశాంతస్య సుఖః కుతః - శాంతి లేనివానికి సుఖము ఎక్కడ?

||శ్లోకతాత్పర్యము||

"ఇన్ద్రియనిగ్రహము లేనివానికి వివేకబుద్ధి కలుగదు. ఇన్ద్రియనిగ్రహము లేనివానికి ఆత్మ చింతన కలుగదు.
ఆత్మచింతన లేనివానికి శాంతి కలుగదు. శాంతి లేనివానికి సుఖము ఎక్కడ?" ||66||

||శ్లోకము 67||

ఇన్ద్రియాణాం హి చరతాం యన్మనఽను విధీయతే |
తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్న్వామివాంభసి ||67||

స|| చరతాం ఇన్ద్రియాణాం యత్ (ఇన్ద్రియః) మనః అనువిధీయతే తత్ ( ఇన్ద్రియః) అస్య ప్రజ్ఞాం ( బుద్ధిం) హరతి హి - ( యథా ) అంభసే నావం వాయురివ హరతి హి ||67||

||శ్లోకార్థములు||

చరతాం ఇన్ద్రియాణాం యత్ - విషయములలో తిరుగుచున్న ఇన్ద్రియములలో
యత్ (ఇన్ద్రియః) మనః అనువిధీయతే - ఏ ఇన్ద్రియము మనస్సు ను అనుసరించుచున్నదో
తత్ ( ఇన్ద్రియః) అస్య ప్రజ్ఞాం ( బుద్ధిం) హరతి హి -
ఆ ఇన్ద్రియము వీనియొక్క మనస్సును హరించును
అంభసే నావం వాయురివ (హరతి హి) - నీటియందు నౌకను వాయువు వలె (హరించును)

||శ్లోకతాత్పర్యము||

"విషయములలో తిరుగుచున్న ఇన్ద్రియములలో, ఏ ఇన్ద్రియము మనస్సు ను అనుసరించుచున్నదో,
ఆ ఇన్ద్రియము వీనియొక్క మనస్సును, నీటియందున్న నౌకను వాయువు వలె, హరించును."||67||

||శ్లోకము 68||

తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః|
ఇన్ద్రియాణీన్ద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్టితా ||68||

స|| హే మహాబాహో! తస్మాత్ యస్య ఇన్ద్రియాణి న్ద్రియార్దేభ్యః సర్వశః నిగృహీతాని తస్య ప్రజ్ఞా ( బుద్ధిః, వివేకః) ప్రతిష్ఠితా ||68||

||శ్లోకార్థములు||

తస్మాత్ యస్య ఇన్ద్రియాణి - అందువలన ఎవరి ఇన్ద్రియములు
ఇన్ద్రియార్దేభ్యః సర్వశః నిగృహీతాని - ఇన్ద్రియ విషయములనుండి ఎల్లప్పుడు నిగ్రహింపబడినవో
తస్య ప్రజ్ఞా ( బుద్ధిః, వివేకః) ప్రతిష్ఠితా- అట్టివాని జ్ఞానము స్థిరమైనది.

||శ్లోకతాత్పర్యము||

"అందువలన ఎవరి ఇన్ద్రియములు, ఇన్ద్రియ విషయములనుండి ఎల్లప్పుడు నిగ్రహింపబడినవో,
అట్టివాని జ్ఞానము స్థిరమైనది".||68||

ఇంద్రియములు వశములో లేనివాడు సుడిగాలిలో చిక్కుకున్న నీళ్ళలోని నావ తో పోల్చి,ఇంద్రియములు వశములో వున్నవాడి ప్రజ్ఞ పటిష్ఠ మైనది అని చెప్పి, కృష్ణుడు ఒక అలంకారిక భాషలో యోగులకు సామాన్య జనులకి భేదము చెపుతాడు.

||శ్లోకము 69||

యానిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ |
యస్యాం జాగ్రతి భూతాని స నిశా పశ్యతే మునేః ||69||

స|| సర్వభూతానాం యా నిశా తస్యాం సంయమీ( యోగీ) జాగర్తి | యస్యాం భూతాని జాగ్రతి సా పశ్యతః మునేః నిశా (భవతి) ||69||

||శ్లోకార్థములు||

సర్వభూతానాం యా నిశా - సమస్త భూతములకు ఏది రాత్రియో
తస్యాం సంయమీ( యోగీ) జాగర్తి - దానియందు నిగ్రహము కల యోగి జాగరూకతలో ఉండును.
యస్యాం భూతాని జాగ్రతి - దేనియందు భూతములు జాగరూకతలో వుండునో
సా పశ్యతః మునేః నిశా- అది జ్ఞానముతెలిసిన మునికి రాత్రి అగుచున్నది

||శ్లోకతాత్పర్యము||

"సమస్త భూతములకు ఏది రాత్రియో, దానియందు నిగ్రహము కల యోగి జాగరూకతలో ఉండును.
దేనియందు భూతములు జాగరూకతలో వుండునో, అది జ్ఞానముతెలిసిన మునికి రాత్రి అగుచున్నది".||69||

యా నిశా సర్వభూతానాం - ఏది సమస్తభూతములకు అంధకారమయమో
తస్యాం జాగర్తి సంయమీ - అది అన్నీ వశములో వున్నవాడికి (మునికి) పట్టపగలు
అంధకారము అజ్ఞానము ఒకటే. సమస్తభూతములకు జ్ఞాన సంబంధమైన విషయములు అంధకారమమయముగా కనిపిస్తాయి. కాని సమస్తము తెలిసిన జ్ఞానికి అ విషయములు పట్టపగలు వలె కనిపిస్తాయి.

యస్యాం జాగ్రతి భూతాని -సమస్త భూతములకు ఏది పట్టపగలో - అంటే అది పట్టపగలులో జరిగే జనుల కార్యక్రమము
సా నిశా పశ్యతే మునేః - ఆ పట్టపగలులో జరిగే కార్యక్రమాలు మునికి అజ్ఞానమయముగా కనిపిస్తాయి.
ఆ పట్టపగలులో జరిగే కార్యక్రమాలు విషయ భోగాలు అవి మునికి అజ్ఞానమనేఅంధకారము అని తెలుసు.

||శ్లోకము 70||

అపూర్వమాణం అచల ప్రతిష్టం
సముద్రమాపః ప్రవిశన్తి యద్వత్ |
తద్వత్ కామాః యం ప్రవిశన్తి సర్వే
సశ్శాన్తి మాప్నోతి న కామ కామీ||70||

స|| అపూర్వమాణం అచలప్రతిష్ఠం సముద్రం ఆపః( నదీ) యద్వత్ ప్రవిశంతి తద్వత్ సర్వే కామాః యం ( బ్రహ్మనిష్టాపర యోగీ) ప్రవిశన్తి | సః శాన్తిం ఆప్నోతి | కామ కామీ (శాంతిం) న ఆప్నోతి ||70||

||శ్లోకార్థములు||

అపూర్వమాణం అచలప్రతిష్ఠం - నీటితో సంపూర్ణముగా నిండి స్థిరముగా వున్న
సముద్రం ఆపః( నదీ) యద్వత్ ప్రవిశంతి - సముద్రమును జలములు ఎలా ప్రవేశించునో
తద్వత్ సర్వే కామాః యం ప్రవిశన్తి - అలాగ సమస్త భోగవిషయములు ఎవరిని ప్రవేశించుచున్నవో
సః శాన్తిం ఆప్నోతి - అట్టివాడు శాంతిని పొందుతున్నాడు.
కామ కామీ (శాంతిం) న ఆప్నోతి - విషయాసక్తి కలవాడు పొందడు

||శ్లోకతాత్పర్యము||

"నీటితో సంపూర్ణముగా నిండి స్థిరముగా వున్నసముద్రమును జలములు ఎలా ప్రవేశించునో,
అలాగ సమస్త భోగవిషయములు ఎవరిని ప్రవేశించుచున్నవో అట్టివాడు శాంతిని పొందుతున్నాడు.
విషయాసక్తి కలవాడు శాంతి పొందడు".|| 70||

ఇక్కడ తెలియవలసినమాట. ఆ స్థిరమైన సముద్ర జలములలో, భీభత్సముచేసిన నదీ జలములు ప్రవేశించినా
ఆ సముద్రము స్థిరముగానే వుంటుంది.

ఆ విధముగా, ఏ మనుజుని లో భోగవిషములన్నీ ప్రవేశించి, నదీ జలములు సముద్రములో అణిగి పోయినట్లు, వాడి మనస్సులో అణిగిపోతాయో అట్టి మనుష్యుడు, 'స శాన్తిమాప్నోతి', శాంతిని పొందును. కామపూరితుడైనవాడు అలాంటి శాంతిని పొందడు.

||శ్లోకము 71||

విహాయ కామాన్ యస్సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహాః|
నిర్మమో నిరహంకారః సశాన్తిమధిగచ్చతి || 71||

స|| యః పుమాన్ సర్వాన్ కామాన్ విహాయ నిస్పృహః భవతి నిర్మమః భవతి నిరహంకారః చరతి సః శాన్తిం అధిగచ్ఛతి || 71||

||శ్లోకార్థములు||

యః పుమాన్ సర్వాన్ కామాన్ విహాయ - ఏ మనుష్యుడు సమస్త కామములను విడిచి
నిస్పృహః భవతి నిర్మమః భవతి- ఆశలేనివానిగా మమకారము లేనివానిగా
నిరహంకారః చరతి - అహంకారములేనివాని వలె తిరుగుచున్నాడో
సః శాన్తిం అధిగచ్ఛతి - అట్టివాడు శాంతిని పొందుచున్నాడు
|| 71||

||శ్లోకతాత్పర్యము||

"ఏ మనుష్యుడు సమస్త కామములను విడిచి, ఆశలేనివానిగా, మమకారము లేనివానిగా,
అహంకారములేనివాని వలె తిరుగుచున్నాడో, అట్టివాడు శాంతిని పొందుచున్నాడు".||71||

ఎవరైతే మమత అహంకారములను విడిచి కోరికలన్నీ విడిచి విషయములపై ఆసక్తి లేకుండా ఉంటాడో, ఆట్టి వాడు శాంతిని పొందుచున్నాడు. 'నిర్మమో నిరహంకారః స శాంతిమధిగచ్ఛతి'.

||శ్లోకము 72||

ఏషా బ్రాహ్మీస్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి|
స్థిత్వాఽ స్యామన్తకాలేఽపి బ్రహ్మ నిర్వాణ మృచ్చతి ||72||

స|| హే పార్థ ! బ్రాహ్మీ స్థితిః ఏనాం ప్రాప్య న విముహ్యతి అన్తకాలే అపి అస్యాం ( బ్రాహ్మీ స్థితిం) స్థిత్వా బ్రహ్మ నిర్వాణం ఋచ్ఛతి ( అప్నోతి) ||72||

||శ్లోకార్థములు||

హే పార్థ ! బ్రాహ్మీ స్థితిః - ఓ పార్థా ఇది బ్రహ్మసంబంధమైన స్థితి.
ఏనాం ప్రాప్య న విముహ్యతి- ఇది పొంది మోహమును పొందడు
అన్తకాలే అపి అస్యాం ( బ్రాహ్మీ స్థితిం) స్థిత్వా - అంతకాలములో కూడా ఈ స్థితిలో వుండి
బ్రహ్మ నిర్వాణం ఋచ్ఛతి - బ్రహ్మ నిర్వాణము పొందును

||శ్లోకతాత్పర్యము||

"ఓ పార్థా ఇది బ్రహ్మసంబంధమైన స్థితి. ఇది పొంది మోహమును పొందడు
అంతకాలములో కూడా ఈ స్థితిలో వుండి బ్రహ్మ నిర్వాణము పొందును".||72||

కృష్ణుడు ఇంద్రియనిగ్రహము , విషయత్యాగము, ఆత్మచింతన వున్నవారికి అవి లేనివారికి కల భేదాలు ఇలా వివరిస్తాడు .

మనోనిర్మలత్వము కలిగిన మనుజునకు సమస్త దుఃఖములు ఉప శమించు చున్నవి. ఆత్మ చింతన లేని వానికి సుఖము లభించదు.
" నిర్మమో నిరహంకారః స శాంతిమధిగచ్ఛతి" అనగా ఇంద్రియనిగ్రహము విషయత్యాగము, అహంకార మమకార రాహిత్యము తో శాంతిని పొందును.

మళ్ళీ ఇంద్రియ నిగ్రహము లేని వారిగురించి చెపుతూ- ఇంద్రియాల వెంట పడే, నిలకడలేని వారి మనస్సు, బుద్ధిని వెనక్కి లాగుతూ ఉంటుంది. ఇంద్రియ నిగ్రహము ఉన్నవారి ప్రజ్ఞ ప్రతిష్ఠ మౌతుంది.

ఎవరికి శాంతి లభిస్తుంది అన్న మాట చెపుతూ కోరికలు ఎవరిలో అణిగి పోతాయో వారు శాంతి పొందుతారు.
కోరికలు కోరుకునే వాడికి ఎటువంటి శాంతి రాదు అని.

అలాగే అన్ని భోగాలను వదిలి దేనిని కోరక అహంకారము మమకారములు లేక సంచరించే వాడు శాంతి పొందుతాడు అని.

"ఇంద్రియనిగ్రహము విషయ త్యాగము అహంకార మమకార రాహిత్యము మొదలైనవి సాధన చేయుచూ రాగా
జీవ బ్రహ్మైక్యము సిద్ధించును. కీటకము భ్రమరముగా మారు విధముగా, జీవుడు బ్రహ్మస్వరూపుడై వెలయును"

ఈ విధముగా ఈ అధ్యాయములో శ్రీకృష్ణుడు సాంఖ్యయోగము , కర్మయోగము తరువాత సన్యాస యోగమును కూడా అర్జునినకు బొధించెను.

నిజ జీవితములో కూడా మనుజుడు ఒక్కొక్క సమయమున తనకు ఎదురగు సమస్యలతో పోరాడ లేక, అధైర్యము పిరికితనము మున్నగు వాటికి నకు లోనయి చేతకాని వలె యగుట సహజము

ఆసమయమున నీరస మావహించి యుండును. దిక్కుతోచని స్థితి ఏర్పడును. ఏపని చేయ వలెనో నిశ్చయముగ తెలియని స్థితిలో నుండును. అదే విషాదములో వున్న అర్జునిమానసిక స్థితి కూడా. అట్టిసమయమున శ్రీ కృష్ణుని బోధ ఎంతయో ఉపకరించును.

ఈ సమస్యల గురించి మనము శోకించుట తగదు. ఏ కార్యములకైననూ మనము నిమిత్తమాత్రులమే కనుక, ఫలితమును ఆశించక ధర్మము నెరవేర్చు దిశగా కార్యము సానుకూల్య పరచు కొనుట ఉత్తమము.

శరీరము యొక్క అశాశ్వతత్వమును మాటి మాటికి తలచుకొను చుండిన, సమస్య యొక్క తీవ్రత బలహిన పడును.
ఆత్మ ఒక్కటియే శాశ్వత మైనదని మననము చేసికొనవలెను.

సమస్యల వలయములో అంటే సమస్యలలో చిక్కు బడి నప్పుడు, పరమాత్మ ధ్యానమందు స్థిరముగా నుండుటకు గట్టి ప్రయత్నము చేయ వలెను. అప్పుడు మనస్సు యొక్క చంచలము తగ్గి , మనో నిర్మలత్వము కలిగి సమస్యలు పరిష్కరించుటకు కావలసిన ధైర్యము శాంతియు లభించును .

ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే
శ్రీకృష్ణార్జున సంవాదే
సాంఖ్య యోగోనామ
ద్వితీయోsధ్యాయః ||

||ఓమ్ తత్ సత్ ||

|| Om tat sat ||

 

|

 

 

 


|| ఓమ్ తత్ సత్ ||

 


".

 

 

.